స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ అయ్యాక తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కో నేత ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. అరెస్ట్ సక్రమం అని ఒకరు.. అక్రమం అని మరొకరు.. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. టీడీపీ మాత్రం రాజకీయ చర్యగా అభివర్ణిస్తోంది. ఇక మొదట్లో స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. ఆ తర్వాత ఎందుకో సైలెంట్ అయ్యారు. మరోవైపు చంద్రబాబుతో ములాఖత్ అయిన పవన్.. ఉమ్మడి పోరాటం చేస్తామని ప్రకటించారు. రెండు వారాలు గడిచినా ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరగ లేదు. దీంతో చంద్రబాబు అరెస్ట్‌పై అనుమానాలతో పాటు ఊహాగానాలు మొదలయ్యాయి.
చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి అంతా బీజేపీనే చేసిందని బాంబు పేల్చారు. వైసీపీ భుజంపై తుపాకీ పెట్టి కమలం తన యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోందని ఆరోపించారు. రఘువీరా కామెంట్లతో చంద్రబాబు అరెస్ట్‌పై కొత్త ప్రచారాలు మొదలయ్యాయి. నిజంగానే బీజేపీ పాత్ర ఉందా.. అది నిజం కాకుంటే ఆ పార్టీ నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారనేది మరో ప్రశ్నగా కనిపిస్తోంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ నుంచి స్పందన కరువైంది. వారాహి మలి విడత యాత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుందో ప్రకటించారే తప్ప.. టీడీపీతో కలిసి జనసేన ఉమ్మడి పోరాటానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో మరిన్ని అనుమానాలకు తావిచ్చినట్టయింది.
అధికార వైసీపీ మాత్రం చంద్రబాబు అరెస్ట్‌ను లైట్ తీసుకుంటోంది. చర్చించడానికి ఇదేం జాతీయ సమస్య కాదని తేల్చేసింది. వంద గోబెల్స్ కలిపితే ఒక చంద్రబాబు అని ఘాటుగా ఆరోపణలు చేసింది. మొత్తానికి ఒక్క అరెస్ట్.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. అరెస్ట్‌ల పర్వం ఒక్కరితోనే ఆగుతుందా..? నాన్‌స్టాప్‌గా కొనసాగుతూనే ఉంటుందా..? అసలు ఈ సంక్షోభం నుంచి టీడీపీ ఎలా బయటపడతుందన్నది బిగ్ టాస్క్‌గా కనిపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..