Guru Gochar 2023
Jupiter Transit 2023: ఈ నెల 23వ తేదీన ఉదయాత్పూర్వం గురు గ్రహం మీనరాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సహజమైన శుభగ్రహంగా పేరుగాంచిన గురుగ్రహం.. అన్ని రాశుల వారికీ వీలైనంతవరకు శుభ ఫలితాలే ఇస్తాడు. దుస్థానాలలో ఉన్నప్పుడు కూడా చాలావరకు మంచి చేయడానికే ప్రయత్నిస్తాడు. వ్యక్తిగత జాతక చక్రంలో ఏ విధంగా ఉన్నప్పటికీ గోచారంలో మాత్రం ఏ రాశిలో ఉన్నప్పటికీ కొద్దో గొప్పో మంచి చేయడానికే అవకాశం ఉంది. అయితే, మొత్తం 12 రాశులలో ఆరు రాశుల వారికి గురువు విపరీత రాజయోగాన్ని పట్టించే అవకాశం ఉందని శాస్త్రం చెబుతోంది. మేషం, మిధునం, సింహం, తుల, ధనస్సు, మీనరాశి వారికి ఈ ఏడాది గురువు అనేక శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. మిగిలిన రాశుల వారికి ఒక మోస్తరుగా మాత్రమే శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది.
గురు గ్రహం మీనరాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించడం వల్ల 12 రాశుల వారికి గురు గోచార ఫలితాలు ఎలా ఉండబోతాయో ఇప్పుడు చూద్దాం.. ప్రముఖ జ్యోతిష్య పండితులు కౌశిక్ ఆయా రాశుల వారీగా అందిస్తున్న గురు గోచార ఫలితాలు ఇవి..
- మేష రాశి: ఈ రాశి వారికి గురువు మార్పు అనేక శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. ఉద్యోగం, వృత్తి, ఆదాయం, కుటుంబం, వివాహం, సంతానం వంటి విషయాలలో సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. విదేశాలలో ఉద్యోగం, ఉద్యోగంలో ప్రమోషన్, నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగ స్థిరత్వం వంటివి తప్పకుండా జరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకోవ డానికి అవకాశం ఉంది. ఇటువంటి వృత్తి నిపుణులు తమ తమ రంగాలలో ఆశించిన దాని కంటే ఎక్కువగా ఆదాయం సంపాదించుకునే సూచనలు ఉన్నాయి. వీరికి ఒక్క క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సఫలం అవుతాయి. సంతాన యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు.
- వృషభ రాశి: ఈ రాశి వారికి గురువు వ్యయ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరగటం, తీర్థయాత్రలు చేయడం, శుభకార్యాల మీద ఖర్చు చేయడం, విహార యాత్రలకు వెళ్లడం, ఇతరులకు మేలు చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, సమాజంలో మంచి గుర్తింపు పొందడం వంటివి చోటు చేసుకుంటాయి. కాగా, స్నేహితుల వల్ల నష్టపోవడం, రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవడం, ఒక పట్టాన ఆదాయం పెరగకపోవడం, అనవసర ఖర్చులు ఎక్కువ కావడం, కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యంతో ఇబ్బంది పడటం వంటివి జరుగుతాయి. అంతేకాక ఈ రాశి వారికి ఒక్క క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడి శారీరకంగా ఇబ్బందిపడటం కూడా జరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. అన్ని విషయాలలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
- మిథున రాశి: ఈ రాశి వారికి లాభ స్థానంలో అంటే 11వ స్థానంలో గురువు ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగాలలో చక్కని పురోగతికి అభివృద్ధికి అవకాశం కలుగుతుంది. ప్రమోషన్లు, అధికార యోగం, అధిక ఆదాయం, ప్రముఖులతో పరిచయం వంటివి తప్పనిసరిగా చోటు చేసుకుంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మరింత మెరుగైన ఉద్యోగం కోసం, మరింత ఎక్కువ ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులు తాము కోరుకున్న ఉద్యోగాలలో చేరటానికి అవకాశం కలుగుతుంది. అనుకో కుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. జీవితం మంచి మలుపు తిరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. సంతానం కలగడానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు.
- కర్కాటక రాశి: ఈ రాశి వారికి దశమ స్థానంలో గురువు ప్రవేశించడం వల్ల నిరుద్యోగులకు, ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి బాగానే ఉంటుంది కానీ, సహచరుల వల్ల అనేక ఇబ్బందులకు గురి కావలసి ఉంటుంది. ఉద్యోగంలో కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు, వెన్నుపోట్లు వంటివి అనుభవానికి వస్తూనే ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. అంతేకాక, ఇంటా బయటా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అనవసర ఖర్చులు ఎక్కువై ఆర్థిక సమస్యలకు లోనవుతారు. ఇక ఆహార విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. బంధువులు అపనిందలు వేసే అవకాశం ఉంది. విహార యాత్రలకు, వినోదయాత్రలకు, దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. విందులు పార్టీల మీద బాగా డబ్బు ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. పొదుపు పాటించడం కూడా ఎంతో కష్టం అవుతుంది.
- సింహ రాశి: ఈ రాశి వారికి భాగ్య స్థానంలో గురువు ప్రవేశిం చడం వల్ల అనుకోని విధంగా అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది. విదేశాలలో చదువు, ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వినడం జరుగుతుంది. వీసా సమస్యలు ఏమైనా ఉంటే అవి సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆదాయాన్ని పెంచుకోవటానికి ఎటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది తప్పకుండా సత్ఫలి తాలను ఇస్తుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. రియల్ ఎస్టేట్ బ్యాంకింగ్ వడ్డీ వ్యాపారం షేర్లు ఆర్థిక లావాదేవీలు వంటి రంగాలలో ఉన్న వారికి ఎంతగానో కలిసి వస్తుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంపన్నుల కుటుంబంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. చిన్నపాటి ప్రయత్నం కూడా చక్కని అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. ప్రయత్నాలు ఆలోచనలు, తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి.
- కన్యా రాశి: ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గురువు సంచరించడం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవు తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బంధు వర్గంలో మాటకు విలువ పెరుగుతుంది. సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. అయితే, కుటుంబంలో కొద్దిగా సుఖ సంతోషాలు, మనశ్శాంతి తగ్గే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో వివాదాలు, విభేదాలు, అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధిం చిన విషయాలలో పేచీలు ప్రారంభం అవుతాయి. అనవసర విషయాలలో ఇతరుల వివాదాల్లో తలదూ ర్చడం మంచిది కాదు. అధికారులతో లేదా యజమానులతో ఆచితూచి వ్యవహరిం చాల్సిన అవసరం ఉంది. తొందరపాటు ఏమాత్రం పనికిరాదు.
- తులా రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో ప్రవేశిస్తున్న గురువు వల్ల ఆర్థిక పరిస్థితుల్లో ఊహించనంతగా మార్పు వచ్చే అవకాశం ఉంది. అనుకోని విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి స్థిరత్వం ఏర్పడు తుంది. ఇంతవరకు ఇతరుల నుంచి ఆర్థికంగా సహాయం పొందిన వారు ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. కుటుంబంలో సామ రస్య వాతావరణం నెలకొంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. దంపతుల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే అవి అనుకో కుండా పరిష్కారం అవుతాయి. ప్రేమ వ్యవహా రాలు విజయవంతం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాల వల్ల లబ్ధి పొందుతారు. భాగస్వాము లతో విభేదాలు వివాదాలు సమసిపోతాయి. విదేశీయానానికి అవకాశం ఉంది. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి కలిసి వస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది.
- వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆరవ స్థానంలో గురువు ప్రవేశించడం వల్ల శత్రు, రోగ, రుణ బాధల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. గతంలో ఈ రాశి వారి నుంచి సహాయం పొందిన వారు, ప్రయోజనం పొందిన వారు అవసర సమయంలో ముఖం చాటేస్తారు. ఇతరుల సమస్యలను మీద వేసుకొని కష్ట నష్టాలకు లోనవుతారు. మితి మీరిన ఔదార్యం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. కొందరు స్నేహితులు మీ బలహీనతలను అవకాశంగా తీసుకుని సమస్యలు సృష్టిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆలయాలు సందర్శించడం, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం, తీర్థయాత్రలు చేయడం వంటివి ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి. స్నేహితులను కూడా గుడ్డిగా నమ్మటం, వారికి ఆర్థిక బాధ్యతలు అప్పగించడం ఏమంత శ్రేయస్కరం కాదు.
- ధనుస్సు రాశి: ఈ రాశి వారికి పంచమ స్థానంలో ప్రవేశిస్తున్న గురువు వల్ల వృత్తి ఉద్యోగాలపరంగా అధికార యోగానికి, అనూహ్యమైన పురోగతికి అవకాశం ఏర్పడుతుంది. ఆశించిన దాని కంటే ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది. సంతానం వృద్దిలోకి వస్తుంది. ఇంతవరకు సంతానం లేనివారికి సంతానయోగం పడుతుంది. ఈ రాశి వారి ఆలోచనలు ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలి తాలను ఇస్తాయి. వీరి సలహాలు, సూచనలకు సర్వత్రా విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అభివృద్ధి చెందుతాయి. ఆశించిన స్థాయిలో ఆధ్యాత్మిక చింతన కొత్త పుంతలు తొక్కుతుంది. ఈ రాశి వారు ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే అంత మంచిది. కొద్దిపాటి ప్రయత్నంతో అధికారం చేపట్టడానికి, ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేపడతారు. బంధుమిత్రులలో చాలామందికి సహాయం చేయడంతో పాటు అండగా నిలబడతారు.
- మకర రాశి: ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో గురువు ప్రవేశించడం వల్ల ఉద్యోగ పరంగా కొన్ని సానుకూల మార్పులు జరగటానికి అవకాశం ఉంది. ఉద్యోగం మారటానికి కూడా అవకాశం ఉంటుంది. గృహ వాహన సౌఖ్యాలకు అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించవచ్చు. నిజానికి ఈ రాశి వారికి ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన వాతావరణం సాఫీగా సాగిపోతుంది కానీ కుటుంబ పరంగా కొద్దిగా మనశ్శాంతి తగ్గే సూచనలు ఉన్నాయి. బంధువులు లేదా సన్నిహితులు లేదా సహచరులు ఈ రాశి వారి మీద అదనపు భారాన్ని వేసే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లోపించే సూచనలు ఉన్నాయి. కుటుంబ పెద్దల నుంచి ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభ్యం అవుతాయి. బంధువులతోనూ, కొందరు స్నేహితులతోనూ అంటి ముట్టనట్టు వ్యవహరించడం మంచిది.
- కుంభ రాశి: ఈ రాశి వారికి మూడవ స్థానంలో గురు సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. పొదుపు నియమాలు పాటించి ఒక ప్రణాళిక ప్రకారం జీవనం సాగిస్తారు. కొద్దికాలం పాటు ఎవరికైనా వాగ్దానాలు చేయటం కానీ, ఈ హామీలు ఉండటం కానీ చేయవద్దు. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. స్నేహి తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇతరులకు సహాయంగా నిలబడ తారు. ఔదార్యంతో వ్యవహరిస్తారు. పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. అయితే, వీలైనంత వరకు ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ప్రయాణాల వల్ల అనారోగ్యానికి గురి కావడం కానీ, డబ్బు నష్టపోవడం కానీ జరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
- మీన రాశి: ఈ రాశి వారికి గురువు రెండవ స్థానంలో అంటే ధనస్థానంలో ప్రవేశించడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు సురక్షితంగా చేతికి అందు తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. లాటరీ, జూదం, షేర్లు, వడ్డీ వ్యాపారం తదితర ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. సంపదను సమకూర్చు కుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. దాంపత్య జీవితం ఆనందంగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలు కూడా ఉన్నాయి. మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి అభివృద్ధి చెందుతాయి. దాదాపు సంవత్సరకాలం అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త ప్రయత్నాలు కొత్త ఆలోచనలతో ఈ సమయాన్ని సద్విని యోగం చేసుకోవడం మంచిది.
ప్రధాన పరిహారాలు
గురు గ్రహం మేష రాశిలో ప్రవేశించినప్పుడు శివాలయానికి వెళ్లి అర్చన చేయించడం వల్ల శీఘ్రంగా సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. తరచూ దత్తాత్రేయ ఆరాధన చేయటం వల్ల కూడా గురువు అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇక పుష్యరాగం లేదా కనక పుష్య రాగం అనే రత్నంతో ఉంగరం ధరించడం వల్ల గురువు అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది.