
జీవితంలో కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఏ పనీ ముందుకు సాగనట్లు, పదేపదే ప్రయత్నించినా విజయం అందని ద్రాక్షలా మిగిలిపోయినట్లు అనిపిస్తుంటుంది. ఇలాంటి సమయాల్లో చాలా మంది నిరాశకు గురవుతుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జీవితంలో ఒక పెద్ద సానుకూల మార్పు రాకముందే విశ్వం , గ్రహాల గమనం మనకు కొన్ని నిర్దిష్టమైన సంకేతాలను అందిస్తాయి. ఒక మార్గం మూసుకుపోతే మరొక కొత్త మార్గం తెరుచుకుంటుందనే నానుడికి తగ్గట్లుగా ఈ మార్పులు సంభవిస్తుంటాయి. చాలా మంది వీటిని సాధారణ విషయాలుగా భావించి విస్మరిస్తుంటారు కానీ, ఇవి అదృష్టం కలిసిరాబోయే కాలానికి సంకేతాలు. మీ జీవితంలో కూడా ఇటీవల కాలంలో ఇలాంటి మార్పులు కనిపిస్తుంటే, విజయానికి ఒక కొత్త మార్గం తెరుచుకోబోతోందని అర్థం చేసుకోవాలి. ఆ 6 ముఖ్యమైన సంకేతాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అదృష్టాన్ని సూచించే ఆ 6 సంకేతాలు
పాత విషయాలకు ముగింపు: జ్యోతిష్య నమ్మకాల ప్రకారం జీవితంలో శని లేదా రాహువు వంటి గ్రహాల ప్రభావం వల్ల మార్పులు వచ్చేటప్పుడు పాత మార్గాలు క్రమంగా మూసుకుపోతాయి. ఉద్యోగం, వ్యాపారం లేదా పాత బంధాలలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు ఒక సరికొత్త ప్రారంభానికి నాంది పలుకుతాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగం కోల్పోయిన తర్వాత, అంతకుముందు ఎన్నడూ ఊహించని మెరుగైన అవకాశాలు లభించడం దీనికి సంకేతం. ఈ సమయం మానసికంగా కష్టంగా అనిపించినప్పటికీ, ఇది గ్రహాల అనుకూల మార్పును సూచిస్తుంది.
తరచూ వచ్చే కొత్త ఆలోచనలు: మీ మనసులో అకస్మాత్తుగా సరికొత్తగా ఏదైనా వ్యాపారం లేదా పని ప్రారంభించాలనే ఆలోచనలు రావడం, భిన్నమైన విషయాలను నేర్చుకోవాలనే తపన పెరగడాన్ని జ్యోతిష్యశాస్త్రం సానుకూల శక్తితో ముడిపెడుతుంది. జాతకంలో గురు గ్రహం శుభ స్థానం వల్లనే ఒక వ్యక్తి ఆలోచనా పరిధి విస్తృతమై, కొత్త అవకాశాలను సులభంగా గుర్తించే సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతారు.
శుభప్రదమైన కలలు రావడం: స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని రకాల కలలు జీవితంలో రాబోయే విజయానికి సూచికలుగా పనిచేస్తాయి. నిద్రలో నీరు, ఆకాశంలో ఎగరడం, దేవాలయాలు, వెలుగుతున్న దీపాలు లేదా సరికొత్త మార్గాలకు సంబంధించిన కలలు రావడం శుభ సంకేతంగా పరిగణిస్తారు. అయితే ఈ కలల వ్యాఖ్యానం అనేది ఆయా వ్యక్తుల పరిస్థితులు , ఆలోచనా విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది.
సరైన వ్యక్తులు అకస్మాత్తుగా కలవడం: మీ జీవితంలో ఎలాంటి ప్రణాళికలు లేకుండానే ఊహించని విధంగా కొందరు వ్యక్తులు ప్రవేశించి, మీరు కెరీర్‌లో ముందుకు సాగడానికి అద్భుతమైన సాయం అందిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం ఇది బృహస్పతి , బుధ గ్రహాల శుభ ప్రభావానికి సంకేతం. ఒక కొత్త వ్యక్తి ద్వారా సరైన సమయంలో సరైన సలహా అందడం లేదా కొత్త సమాచారం లభించడం జీవితాన్ని మలుపు తిప్పుతుంది.
అంతర్గత మార్పులను అనుభూతి చెందడం: బాహ్య పరిస్థితులలో ఇంకా ఎలాంటి మార్పులు రాకముందే, ఒక వ్యక్తి ఆలోచనలలో , అంతర్గతంగా సానుకూల మార్పులు ప్రారంభమవుతాయి. మనసులోని పాత భయాలు, ఆందోళనలు తగ్గిపోయి కొత్త విషయాలను స్వీకరించాలనే ఆత్మవిశ్వాసం , కోరిక పెరుగుతుంటే, దానిని అంతర్గత శక్తిలో వచ్చిన సానుకూల మార్పుగా భావించాలి.
నిలిచిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తి కావడం: చాలా కాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా అకస్మాత్తుగా పూర్తి కావడం, ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోవడం లేదా గతంలో ఫలించని ప్రయత్నాలు ఇప్పుడు సానుకూల ఫలితాలను ఇవ్వడం వంటివన్నీ శుభకాలం రాబోతుందనడానికి స్పష్టమైన సంకేతాలు.