
విజయనగరం, సెప్టెంబర్ 17: సహజీవనం చేస్తున్న జంట మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివాహమై పిల్లలు ఉన్న ఓ మహిళ తన ప్రియుడిని దారుణంగా హతమార్చింది. ఈ ఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కందిపేటకు చెందిన దనాల రాములమ్మ కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో తన బావ కుమారుడైన శ్రీనుతో ఆమెకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. శ్రీను కూడా తన భార్యకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాములమ్మకు, శ్రీనుకి పరిచయం ఏర్పడింది. దీరు కొంతకాలంగా రాములమ్మ, శ్రీను కలిసి సహజీవనం చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రాములమ్మ ఇనుపరాడ్డుతో శ్రీను తలపై దాడి చేసింది. అనంతరం అతడిపై యాసిడ్ పోసింది. తీవ్ర గాయాలతో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటన అనంతరం రాములమ్మ పురుగుల మందు తాగింది. గమనించిన ఇరుగుపొరుగు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చీపురుపల్లి సీఐ శంకరరావు, ఎస్సై లోకేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి చేస్తారు.