నిందితుల కాళ్లకే పోలీసులు ఎందుకు గురిపెడతారు? హేమంత్ కుడికాలు తొలగించడానికి కారణమిదే..

రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరపడం, తీవ్ర గాయాల కారణంగా అతడి కుడి కాలును తొలగించాల్సి రావడం చర్చనీయాంశమైంది. పోలీసులు నిందితుల కాళ్లపై ఎందుకు కాల్పులు జరుపుతారు? అలాంటి కాల్పుల్లోనూ ప్రాణాపాయం ఎందుకు ఉంటుంది? పోలీసుల ఆత్మరక్షణ హక్కు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుందాం..

నిందితుల కాళ్లకే పోలీసులు ఎందుకు గురిపెడతారు? హేమంత్ కుడికాలు తొలగించడానికి కారణమిదే..
Police Firing Explained

Edited By:

Updated on: Nov 03, 2026 | 10:17 AM

పొద్దున్నే నిద్రలేచి సెల్‌ఫోన్‌, పేపర్లు చూసిన చాలామంది రాప్తాడు ఘటన గురించే వెతికారు. నిందితుడు హేమంత్‌ను పోలీసులు పట్టుకున్నారా లేదా. అసలు ఏం జరిగింది. ఎన్‌కౌంటర్‌ చేశారా.. కాల్చి చంపేశారా…? ఇలాంటి వార్తల కోసం ఆసక్తిగా చూశారు. తీరా చూస్తే అతన్ని చంపలేదు. కాలికి మాత్రమే కాల్పులు జరిపారని తెలిసింది. బయటకు వచ్చిన ఫొటోలు కూడా అదే విషయాన్ని చూపించాయి. దీంతో మరో చర్చ మొదలైంది. ఇంకా అతన్ని చంపలేదా.. బతికే ఉన్నాడా అంటూ బాధితురాలు లక్ష్మి ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడిన మాటలు కలకలం రేపాయి.

ఆ మాటల్లో బాధ ఉంది. కోపం ఉంది. తమకు జరిగిన అన్యాయానికి నిందితుడికి కఠిన శిక్ష పడాలనే ఆకాంక్ష ఉంది. ఒక బాలికపై జరిగిన దాడి ఎంతటి ఆవేదన కలిగించిందో ఈ స్పందన చెబుతోంది. బాధిత కుటుంబం మాత్రమే కాదు.. ఈ వార్త చూసిన చాలామంది కూడా నిందితుడికి కఠిన శిక్ష పడాలని కోరుకున్నారు. కానీ ఇక్కడే మరో అంశాన్ని చూడాలి. నిందితుడిపై ప్రజలకు కోపం ఉండొచ్చు. బాధితుల ఆవేదనను అర్థం చేసుకోవాలి. అదే సమయంలో పోలీసులు చట్టం పరిధిలోనే వ్యవహరించాలి. నేరం చేసిన వ్యక్తికి శిక్ష విధించేది న్యాయస్థానం. పోలీసుల పని నిందితుడిని పట్టుకుని కోర్టు ముందు నిలబెట్టడం. కోపం కళ్లను కప్పేస్తే. న్యాయం దారి తప్పుతుందంటారు..

గత ఘటనలు గుర్తుకొస్తున్నాయా..

అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనతో గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొన్ని ఘటనలు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. వరంగల్‌ యాసిడ్‌ దాడి ఘటనలో స్వప్నిక, ప్రణీత్‌పై దాడి చేసిన ముగ్గురు నిందితులు 2008లో పోలీసుల కాల్పుల్లో మరణించారు. అప్పట్లో ఈ ఘటన పెద్ద చర్చకు దారితీసింది. అలాగే 2019లో హైదరాబాద్‌ దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. పోలీసుల కథనం ప్రకారం.. విచారణ కోసం తీసుకెళ్లిన సమయంలో నిందితులు ఆయుధాలు లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా కొందరు హర్షం వ్యక్తం చేయగా.. మరికొందరు చట్టపరమైన ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తారు.

ఈ రెండు ఘటనల్లోనూ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం కనిపించింది. నిందితులకు కఠిన శిక్ష పడిందనే భావనతో చాలామంది స్పందించారు. అయితే ఎన్‌కౌంటర్‌ జరిగినంత మాత్రాన న్యాయ ప్రక్రియ అవసరం లేదని చెప్పలేం. ప్రతి ఘటనలోనూ నిజానిజాలు తేలాల్సిందే.

ఏపీలోనూ ఇలాంటి కాల్పులు..

ఇది ఒక్క రాప్తాడు ఘటనతోనే మొదలైన చర్చ కాదు. ఈ ఏడాది మార్చి 27న అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏడేళ్ల బాలుడి హత్య కేసు నిందితుడు సర్వేష్‌ కుమార్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. నేర స్థల పునర్నిర్మాణం సమయంలో బీర్‌ బాటిల్‌తో పోలీసులపై దాడి చేశాడని పోలీసులు చెప్పారు. CI, కానిస్టేబుల్‌ గాయపడటంతో తొలుత హెచ్చరిక కాల్పులు జరిపి.. ఆ తర్వాత అతని కాళ్లపై కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. కడప జిల్లా ఖాజీపేట, మైదుకూరు ప్రాంతాల్లో బాలిక హత్య కేసు నిందితుడు వెంకటేష్‌పై కూడా పోలీసులు కాల్పులు జరిపారనే వార్తలు వచ్చాయి. కృష్ణా జిల్లా కంకిపాడులో గంజాయి కేసు నిందితుడు అవినాష్‌పై కాల్పులు జరిగాయి. అనంతపురంలో అజయ్‌ అనే నిందితుడిపై కూడా కాల్పుల ఘటన నమోదైంది. ఇలాంటి ఘటనల్లో పోలీసుల వాదన సాధారణంగా ఆత్మరక్షణ చుట్టూనే ఉంటుంది. నిందితుడు దాడికి దిగాడని.. పోలీసుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని చెబుతుంటారు. అయితే ఈ వాదనకు ఆధారాలు ఉండాలి. కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది. ఇతర మార్గాలు ఉన్నాయా అనే అంశాలు కూడా పరిశీలించాలి.

పోలీసులకూ ప్రాణభయం లేదా..

పోలీసుల వైపు నుంచి కూడా ఆలోచించాల్సిన అంశాలున్నాయి. నిందితులను పట్టుకునే సమయంలో కొన్నిసార్లు వారు ఎదురు తిరుగుతారు. కత్తులు, రాళ్లు, ఇతర ఆయుధాలతో దాడికి దిగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసుల ప్రాణాలకూ ముప్పు ఉంటుంది. తమతో పాటు తోటి సిబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. రాప్తాడు ఘటనలోనూ పోలీసులపై నిందితుడు కత్తితో దాడికి యత్నించాడని, ఒక CI గాయపడ్డారని పోలీసులు చెప్పారు. తొలిగా హెచ్చరిక కాల్పులు జరిపినా ఆగకపోవడంతో కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. ఈ వివరాలన్నీ అధికారిక వాదనలో భాగం. వాటిని ఆధారాలతో పరిశీలించాల్సిన అవసరం ఉంది.

కాల్పులు జరిపిన ప్రతిసారీ పోలీసులను తప్పుపట్టలేం. అలాగే ఆత్మరక్షణ పేరుతో చేసిన ప్రతి కాల్పునూ సమర్థించలేం. ఏం జరిగింది. ఆ సమయంలో ఎంతటి ప్రమాదం ఉంది. కాల్పులు తప్ప మరో మార్గం లేదా అనే వాదనుంది.

కాలికి గురిపెట్టడం వెనుక కారణమేంటి.. రాప్తాడు నిందితుడు హేమంత్ కాలు ఎందుకు తీసేశారంటే..?

నిందితుడిని చంపకుండా అదుపులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో కాళ్ల కింది భాగానికి గురిపెడతారనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ కాలికి కాల్చడం అంటే ప్రాణాపాయం ఉండదని కాదు. తొడ, మోకాలి దగ్గర ప్రధాన రక్తనాళాలు ఉంటాయి. తీవ్ర రక్తస్రావం జరిగితే ప్రాణాలకే ప్రమాదం. సకాలంలో వైద్యం అందకపోయినా పరిస్థితి విషమించవచ్చు. రాప్తాడు ఘటనలో హేమంత్‌ కాలికి తీవ్ర నష్టం జరిగింది. అతని కాలికి రక్తప్రసరణ దెబ్బతినడంతో వైద్యులు శస్త్రచికిత్స అవసరంపై పరిశీలించారు. కాలు పూర్తిగా దెబ్బ తినడంతో.. కుడి కాలును తీసివేశారు. రక్తస్రావం ఎక్కువ కావడం, పూర్తిగా దెబ్బతిని కుళ్లిపోవడంతో కుడికాలు తొడ బాగం వరకు నిందితుడు హేమంత్ కాలు తొలగించినట్లు డాక్టర్లు తెలిపారు. కాబట్టి కాలికి కాల్చడం చిన్న గాయమేనని భావించకూడదు.

పోలీసుల ముందున్న పరిస్థితి కూడా అంత సులభం కాదు. ఎదురుగా ఉన్న వ్యక్తి కత్తితో దాడి చేస్తుంటే వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ నిర్ణయం అవసరమైనంత మేరకే ఉండాలి. ప్రాణాలు కాపాడుకోవడం పేరుతో అవసరానికి మించి బలప్రయోగం చేయడానికి చట్టం అనుమతించదు. తుపాకీ చేతిలో ఉందని గురి తప్పకూడదు.. అధికారం ఉందని హద్దు దాటకూడదంటారు పెద్దలు.

కాల్పులకు ముందు ఏం జరిగింది

ఇలాంటి ఘటనల్లో అసలు పరిశీలించాల్సిన అంశం కాల్పుల తర్వాత ఏం జరిగిందనేది మాత్రమే కాదు. కాల్పులకు ముందు ఏం జరిగిందన్నది కూడా ముఖ్యం. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ఎప్పుడు వెళ్లారు. అతను ఎలా ఎదురు తిరిగాడు. హెచ్చరికలు ఇచ్చారా. అతని చేతిలో ఏ ఆయుధం ఉంది. పోలీసులపై దాడి జరిగిందని చెప్పడానికి ఆధారాలున్నాయా. అక్కడ బాడీ కెమెరాలు, CCTV కెమెరాలు ఉన్నాయా. ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు.

కాల్పుల సమయంలో ఎన్ని రౌండ్లు ప్రయోగించారు. ఏ దూరం నుంచి కాల్చారు. బుల్లెట్లు ఎక్కడ తగిలాయి. వైద్య నివేదికలు ఏం చెబుతున్నాయి. ఇవన్నీ బయటకు రావాలి. పోలీసుల కథనం మాత్రమే కాకుండా అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలను కూడా పరిశీలించాలి. కాల్పుల తర్వాత కథనం కాదు.. కాల్పులకు ముందు ఏం జరిగిందన్నదే అసలు కథనం.

ప్రజల్లో ఎన్‌కౌంటర్లపై ఆకర్షణ ఎందుకు..

నిందితుడికి వెంటనే శిక్ష పడాలనే భావన ప్రజల్లో ఎందుకు పెరుగుతోంది. దీనికి కొన్ని కారణాలున్నాయి. తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. కేసుల విచారణలో ఆలస్యం కావడం. సాక్షులు వెనక్కి తగ్గడం. నిందితులు బెయిల్‌పై బయటకు రావడం. బాధిత కుటుంబాలు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం కూడా ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. న్యాయం ఆలస్యమైతే బాధిత కుటుంబం పడే కష్టం అంతా ఇంతా కాదు. ప్రతి వాయిదాకు కోర్టుకు వెళ్లాలి. సాక్ష్యాలు చెప్పాలి. మళ్లీ మళ్లీ జరిగిన ఘటనను గుర్తు చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో నిందితుడికి వెంటనే శిక్ష పడాలని ప్రజలు కోరుకోవడం సహజం.

కానీ ఆ ఆవేశంలోనే న్యాయ ప్రక్రియను పక్కన పెట్టలేం. నిందితుడే నేరం చేశాడని తేల్చేది దర్యాప్తు, సాక్ష్యాలు, కోర్టు విచారణ. నేరం రుజువైతే కఠిన శిక్ష పడాలి. అందుకు విచారణ వేగంగా జరిగేలా వ్యవస్థ పనిచేయాలి. ఆలస్యమైన న్యాయం. ఆవేశానికి ఆజ్యం పోస్తుంది.

చట్టం ఏం చెబుతోంది..

పోలీసులు కాల్పులు జరిపిన ప్రతిసారీ వాటిని ఎన్‌కౌంటర్‌ అని పిలవలేం. కాల్పుల్లో నిందితుడు చనిపోయినా.. తీవ్రంగా గాయపడినా పోలీసుల చర్యలపై న్యాయపరమైన పరిశీలన అవసరం. కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది. హెచ్చరిక ఇచ్చారా. ఇతర మార్గాలు ఉన్నాయా. ఎన్ని రౌండ్లు కాల్చారు. ఎక్కడ గురిపెట్టారు. ఇవన్నీ పరిశీలించాల్సిన అంశాలే. సుప్రీంకోర్టు 2014లో పోలీసు ఎన్‌కౌంటర్లపై మార్గదర్శకాలు ఇచ్చింది. కాల్పుల్లో మరణం సంభవిస్తే FIR నమోదు చేయాలి. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలి. మేజిస్ట్రేట్‌ విచారణ చేపట్టాలి. ఆధారాలను భద్రపరచాలి. పోలీసుల చర్యలపై పారదర్శక విచారణ ఉండాలని స్పష్టం చేసింది.

దిశ కేసులోనూ ఇదే విషయం స్పష్టమైంది. 2019లో నలుగురు నిందితులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. పోలీసుల కథనానికి భిన్నంగా సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ ఆ కాల్పులను బూటకపు ఎన్‌కౌంటర్‌గా నిర్ధారించింది. సంబంధిత పోలీసులపై హత్య కేసు నమోదు చేసి విచారణ జరపాలని సిఫారసు చేసింది. అంటే ప్రజల ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉన్నా.. చట్టపరమైన పరిశీలన తప్పనిసరి. రాప్తాడు ఘటనలోనూ కాల్పుల వెనుక జరిగిన పరిణామాలు, పోలీసుల వాదన, వైద్య నివేదికలు, అందుబాటులో ఉన్న వీడియో ఆధారాలను పరిశీలించాలి. అవసరమైన విచారణ జరగాలనే వాదనుంది.

బాధితులకు న్యాయం.. నిందితులకు శిక్ష

ఇక్కడ అసలు విషయం బాధితులకు న్యాయం జరగడం. దాడికి గురైన బాలికలు కోలుకోవాలి. వారి కుటుంబాలకు అండగా నిలవాలి. బాధితులకు వైద్య సహాయం, మానసిక ధైర్యం కల్పించాలి. నిందితుడిపై కేసు వేగంగా విచారణకు రావాలి. నేరం రుజువైతే చట్టం ప్రకారం కఠిన శిక్ష పడాలి. పాఠశాలల్లో బయట వ్యక్తుల ప్రవేశంపై నియంత్రణ ఉండాలి. గేట్ల దగ్గర పర్యవేక్షణ పెరగాలి. విద్యార్థినులు ప్రమాదంలో ఉన్నప్పుడు వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులకు నిందితుడి మరణమే న్యాయమని అనిపించేంత ఆవేదన కలిగిందంటే.. సమాజంలో మహిళలు, బాలికల భద్రతపై ఎంత భయం ఉందో అర్థం చేసుకోవాలి. ఆ భయాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులకు, పాఠశాల యాజమాన్యాలకు కూడా ఉంది.

నేరగాడికి శిక్ష పడాలి.. కానీ న్యాయానికి తుపాకీ తీర్పు చెప్పకూడదు.

రాప్తాడు ఘటన మన ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను ఉంచుతోంది. బాలికలపై దాడులకు పాల్పడేవారికి చట్టం ప్రకారం కఠిన శిక్ష పడాలి. పోలీసుల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే ఆత్మరక్షణకు చట్టం అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో ఆ బలప్రయోగం అవసరమైన మేరకే జరిగిందా అనే పరిశీలన కూడా ఉండాలి. ప్రజలకు కావాల్సింది ఆగ్రహం చల్లారడం మాత్రమే కాదు. బాధితులకు న్యాయం జరగడం. నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడడం. పోలీసులు తమ విధులను చట్టబద్ధంగా నిర్వహించడం. మళ్లీ ఇలాంటి ఘటన జరగదనే భరోసా కలగడం. అదే నిజమైన న్యాయం.. అదే సమాజానికి రక్ష..

Loading...
Unable to load recommendations.
Follow Us