బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?

AP - TG Weather Update: బంగాళాఖాతంలో నవంబర్ 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
Weather Alert

Updated on: Nov 10, 2026 | 7:40 AM

బంగాళాఖాతంలో మరోసారి వాతావరణం మారుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13న (గురువారం) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే యానాం తదితర ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని గమనం, తీవ్రతను బట్టి వర్షాల తీవ్రతపై మరింత స్పష్టత రానుంది. దీంతోపాటు.. ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని.. దీని ప్రభావంతో అక్కడక్కడ ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది.

మరోవైపు పెరుగుతున్న చలి తీవ్రత:

ఇదిలా ఉండగా, తెలంగాణలో ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతుండగా, ఉదయ వేళల్లో పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏపీలోని పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 డిగ్రీలకు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల (చలి, పొగమంచుతో పాటు ఆకస్మిక వర్షాలు) దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us