వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఇందుకూరి రఘురాజు గత ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష నాయకులతో రాజకీయ మంతనాలు జరిపారని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆయనపై చర్యలకు డిమాండ్ చేసింది. వైసీపీ ఫిర్యాదుతో శాసనమండలి ఛైర్మన్ జూన్ 3న రఘురాజుపై అనర్హత వేటు వేశారు. దీంతో రఘురాజు కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 6న ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మండలి చైర్మన్ ఇచ్చిన అనర్హత ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది.
వాస్తవానికి ఈ నెల 4న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. వైసీపీ నుంచి శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఇందుకూరి సుధారాణి, కారాడ వెంకటరావు నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి చేసి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇలా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే హైకోర్టులో బహిష్కృత ఎమ్మెల్సీ రఘురాజు వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. రఘురాజుపై వేసిన అనర్హత వేటు చెల్లదని, మరోసారి రఘురాజు వాదనలు వినాలని శాసనమండలి చైర్మన్‌కి సూచించింది. అతను ఎమ్మెల్సీగా కొనసాగొచ్చని తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈసీ నోటిఫికేషన్ రద్దు చేసింది. షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల 28న పోలింగ్ జరగాల్సి ఉంది.