
కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో వీధి బాలల కోసం ‘ఆపరేషన్ ముస్కాన్ C 19’ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ పోలీసులు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు వేలకు పైగా బాల బాలికలకు విముక్తి కలిగించారు. గత నాలుగు రోజులుగా మొత్తం 2,670 వీధి బాలబాలికలను గుర్తించిన పోలీసులు 2,500 మందిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. మరో 170 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ఇక 837 మంది బాల బాలికలకు కరోనా పరీక్షలు చేయగా.. ముగ్గురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారిని క్వారంటైన్‌కు తరలించారు. కాగా దేశంలోనే వీధి బాలబాలికలకు కరోనా పరీక్షలు చేస్తున్న మొదటి రాష్ట్రం ఏపీనే కావడం విశేషం.