వామ్మో.. కర్నూలు జిల్లాలో డెత్‌ స్పాట్.. ఐదేళ్లలో 50 మంది బలి!

శ్రీ గురురాఘవేంద్ర స్వామి కొలువైన మంత్రాలయం పుణ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనానికి ముందు లేదా తర్వాత ఆలయం పక్కనే ఉన్న తుంగభద్ర నదిలో పుణ్యస్నానం చేయడం భక్తుల ఆనవాయితీ. అయితే, భక్తుల పాపాలను కడిగే ఆ పవిత్ర నది, కొన్నిసార్లు పర్యాటకులు, యువత పాలిట మృత్యువలయంగా మారుతోంది. గత ఐదేళ్లలోనే ఇక్కడ 50 మందికి పైగా భక్తులు నది ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.

వామ్మో.. కర్నూలు జిల్లాలో డెత్‌ స్పాట్.. ఐదేళ్లలో 50 మంది బలి!
Tungabhadra River Deaths

Edited By:

Updated on: Jun 03, 2026 | 1:32 PM

దర్శనం కోసం వచ్చే భక్తులకు మంత్రాలయం ఆధ్యాత్మిక క్షేత్రం.. కానీ, ఆలయం పక్కన ఉన్న తుంగభద్ర నది మాత్రం కొన్నిసార్లు మృత్యు వలయం గా మారుతోంది. గత ఐదేళ్లలో పలువురు భక్తులు, యువకులు, విద్యార్థులు నది ప్రవాహంలో ప్రాణాలు కోల్పోగా, తాజా ఘటనలో మరో ఏడుగురు గల్లంత య్యారు. ప్రతి ప్రమాదం తర్వాత కన్నీళ్లు, ఆర్తనాదాలు, గాలింపు చర్యలే మిగులుతున్నా… శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. తుంగభద్ర తీరంలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్న ఈ విషాదాలు ఇప్పుడు భద్రతా వ్యవస్థపై కీలక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

గత ఐదేళ్లలో ఇప్పటివరకు 50 మందికి పైగా తుంగభద్ర నదిలో మృత్యువాత పడడం సంచలనంగా మారింది. గత శనివారం ఐదుగురు గల్లంతైన ఘటనతో మరోసారి మంత్రాలయం వద్ద భద్రతా ఏర్పాట్లు, నదీ తీరంలో నియంత్రణ చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు శ్రీ గురురాఘవేంద్ర స్వామి దర్శనానికి మంత్రాలయానికి వస్తుంటారు. వీరిలో ఆంద్ర రాష్ట్రాల తో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు వస్తుంటారు. వీరు దర్శనం అనంతరం తుంగభద్రలో పుణ్యస్నానం చేయడం ఆనవాయితీగా మారింది. అయితే నది లోతు, ప్రవాహం, ప్రమాదకర ప్రాంతాలపై సరైన అవగాహన లేకపోవడంతో తరచూ విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

స్థానికుల సమాచారం, అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం గత ఐదేళ్లలో మంత్రాలయం పరిసరాల్లో తుంగభద్ర నదిలో పలుమార్లు మునక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా భక్తులు, యువకులు, విద్యార్థులే ఎక్కువగా బలవుతున్నారు. గత ఏడాది (2025) జూలైలో కర్ణాటకకు చెందిన ముగ్గురు యువకులు మంత్రాలయం దర్శనానికి వచ్చి తుంగభద్రలో స్నానం చేస్తుండగా ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందారు. సచిన్ (20), ప్రమోద్ (20), అజిత్ (19) అనే యువకుల మృతదేహాల ను మరుసటి రోజు వెలికితీశారు. ప్రవాహం ఎక్కువగా ఉందంటూ పోలీసులు, దేవస్థానం హెచ్చరించినప్పటికీ వారు నదిలోకి దిగినట్లు విచారణలో తేలింది. ఈసారి జరిగిన ఘటనలో ఐదేళ్ల చిన్నారి యువన్ చంద్రతో పాటు హైదరాబాద్‌కు చెందిన సతీష్, మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర, ధను, ఉరవకొండకు చెందిన సంధ్యా గల్లంతయ్యారు.
సత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరై ఆనందంగా గడిపిన కుటుంబాలు కొద్ది నిమిషాల్లోనే గాలిలో కలిసి పోయి విషాదంలో మునిగిపోయాయి. గల్లంతైన మూడు గంటలకు ధనుష్ మృతదేహం లభించింది. మిగిలిన వారి కోసం పోలీసులు, జాలర్లు, సహాయక బృందాలు రాత్రింబవళ్లు గాలింపు చర్యలు కొనసాగించారు.

ఇవి కూడా చదవండి

ప్రతి మునక ప్రమాదం జరిగినప్పుడు స్థానిక జాలర్లే మొదట రంగంలోకి దిగుతున్నారు. నది లోతు, ప్రవాహ దిశ, ప్రమాదకర ప్రాంతాలపై వారికి ఉన్న అవగాహనతోనే చాలా సందర్భాల్లో మృతదేహాలను గుర్తించడం సాధ్యమవుతోంది. ఈసారి కూడా ఫ్లడ్లైట్ల వెలుగులో రాత్రి వరకు జాలర్లు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.. గల్లంతైన వారి కోసం నది ఒడ్డున ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యుల పరిస్థితి వర్ణనాతీతం. ఉదయం వరకు మాతోనే ఉన్నారు… ఇప్పుడు ఎక్కడున్నారో తెలియడం లేదు అంటూ బంధువులు విలపిస్తున్నారు. ఐదేళ్ల బాలుడి కోసం తల్లిదండ్రులు పడుతున్న వేదన అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.

గత ఐదేళ్లలో తుంగభద్రలో ప్రధాన విషాదాలు :

2025 జూలై 12 న ముగ్గురు కర్ణాటక విద్యార్థులు మృతి హాసన్ జిల్లాకు చెందిన అజిత్ (19), సచిన్ (20), ప్రమోద్ (20) మంత్రాలయం దర్శనానికి వచ్చి తుంగభద్రలో స్నానం చేస్తూ ప్రవాహంలో కొట్టుకుపోయారు. మరుసటి రోజు వారి మృతదేహాలను వెలికితీశారు.

2024 వరదల సమయంలో : భక్తులకు నదిలో ప్రవేశం నిషేధం తుంగభద్ర డ్యాం నుంచి భారీగా నీటి విడుదలతో నది ఉద్ధృతంగా ప్రవహించింది. ప్రమాదాలను నివారించేందుకు అధికారులు నదిలో స్నానాలను నిలిపివేశారు.

ప్రతి ఘటనలో కనిపిస్తున్న ఒకే తరహా కారణాలు !

మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో గల్లంతై ప్రాణాలు కోల్పొతున్న వారిలో ప్రధానంగా లోతుపై సరైన అవగాహన లేకపోవడం, ఈత రాని వారు లోపలికి వెళ్లడం, ఫోటోలు, సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లడం, హెచ్చరిక బోర్డులను పట్టించుకోకపోవడం, నది ప్రశాం తంగా కనిపించినా అడుగున బలమైన ప్రవాహాలు ఉండటం, భక్తులు, పర్యాటకులకు స్థానిక పరిస్థితులపై అవగా హన లేకపోవడం వంటి వాటిని నిపుణులు ఉదహారి స్తున్నారు. ముఖ్యంగా తుంగభద్ర నది మంత్రాలయం వద్ద వెడల్పుగా ఉండటంతో నీటి వేగం బయటకు స్పష్టంగా కనిపించదు. కొన్ని అడుగుల దూరంలోనే లోతు అకస్మా త్తుగా పెరుగుతుంది. పైకి నిశ్శబ్దంగా కనిపించే నీటిలో అడుగుభాగంలో బలమైన ప్రవాహాలు, సుడిగుండాలు ఉండే అవకాశం ఉందని స్థానిక జాలర్లు చెబుతున్నారు.

అయినా మారని పరిస్థితులు:

మంత్రాలయానికి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. కానీ, ప్రతి ఏడాది తుంగభద్ర తీరం ఏదో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగులుస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడల్లా గాలింపు చర్యలు, హెచ్చరికలు, సమీక్ష సమావేశాలు జరుగుతున్నా… శాశ్వత భద్రతా వ్యవస్థ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి ప్రమాదం తర్వాత హెచ్చరిక బోర్డులు, పోలీసుల సూచనలు, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రవేశ నిషేధం వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. స్థానిక ప్రజలు, భక్తులు పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా నదీ తీరంలో శాశ్వత లైఫ్ గార్డుల నియామకం వంటివి చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రమాదకర ప్రాంతాల వద్ద ఇనుప బ్యారికేడ్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, నదిలో కి దిగే ప్రాంతాల పరిమితీకరణ, పుణ్యస్నాన ఘాట్ల వద్ద రక్షణ తాళ్లు, విపత్తు స్పందన బృందాల శాశ్వత మోహరింపు వంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 100 ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుకోకుండ భక్తుల ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నారు స్థానికులు, భక్తులు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us