శ్రీవారి ప్రసాదాల్లో భారీ మార్పులు.. నాణ్యత, భద్రత కోసం సీఎఫ్‌టీఆర్‌ఐతో టీటీడీ కీలక ఒప్పందం!

TTD Partners with CFTRI: శ్రీవారి ప్రసాదాల నాణ్యత, భద్రతను మరింత మెరుగుపరచేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎస్‌ఐఆర్–సీఎఫ్‌టీఆర్‌ఐ మైసూరుతో కుదిరిన ఒప్పందం ద్వారా ప్రసాదాల తయారీ, నిల్వ, నాణ్యత పరీక్షలు, ప్యాకేజింగ్, సిబ్బంది శిక్షణలో శాస్త్రీయ విధానాలను అమలు చేయనుంది. సంప్రదాయ రుచి, పవిత్రతను కాపాడుతూనే అత్యున్నత ఆహార భద్రతా ప్రమాణాలను అందించడం ఈ భాగస్వామ్య ప్రధాన లక్ష్యం.

శ్రీవారి ప్రసాదాల్లో భారీ మార్పులు.. నాణ్యత, భద్రత కోసం సీఎఫ్‌టీఆర్‌ఐతో టీటీడీ కీలక ఒప్పందం!
Ttd Tirumala Prasadam

Edited By:

Updated on: Jun 15, 2026 | 9:07 PM

తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ, నిల్వ, నాణ్యత పరీక్షల్లో శాస్త్రీయ విధానాల అమలుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. శ్రీవారి ప్రసాదాల భద్రత, పోషక విలువలు, నాణ్యత మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్‌ఐఆర్–సీఎఫ్‌టీఆర్‌ఐ, మైసూరుతో టీటీడీ అవగాహన ఒప్పందం చేసుకుంది.
శ్రీవారి ప్రసాదాలు, టీటీడీ ఆధ్వర్యంలో తయారై, పంపిణీ అయ్యే ఆహార పదార్థాలు అత్యున్నత భద్రతా ప్రమాణాలు, పోషక విలువలు, నాణ్యతతో భక్తులకు అందేలా చేసేలా చర్యలు చేపట్టింది. ప్రసాదాలు ఆహార పదార్థాలు సంప్రదాయ స్వరూపాన్ని పరిరక్షించేందుకు టీటీడీ సీఎస్‌ఐఆర్–సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్‌టీఆర్‌ఐ) మైసూరు మధ్య ఎట్టకేలకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా టీటీడీ ఆహార నిర్వహణ వ్యవస్థల్లో శాస్త్రీయ పద్ధతులను ప్రవేశపెట్టనుంది

ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవే…

భద్రత, నాణ్యత నియంత్రణ బలోపేతం చేయనుంది.
ముడి పదార్థాల కొనుగోలు, ఆహార తయారీ, పంపిణీ ప్రక్రియలలో కఠినమైన నాణ్యత నియంత్రణ ప్రమాణాలు, ప్రామాణిక కార్యాచరణ విధానాలు (ఎస్‌ఓపీలు), పర్యవేక్షణ వ్యవస్థలను టీటీడీ–సీఎఫ్‌టీఆర్‌ఐ సంయుక్త బృందాలు రూపొందించి అమలు చేస్తాయి.

ఆధునికీకరణకు మార్గదర్శకత్వం…

ఇక నిల్వ, నాణ్యత పరీక్షలు, ముడి పదార్థాల కొనుగోలు వ్యవస్థల ఆధునికీకరణకు సీఎఫ్‌టీఆర్‌ఐ సాంకేతిక సలహాలు అందిస్తుంది. శాస్త్రీయంగా ధృవీకరించిన సాంకేతికతలు, ఉత్తమ విధానాల అమలు ద్వారా కలుషిత ప్రమాదాలను తగ్గించి, నాణ్యతలో స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రసాదాల సంరక్షణ…

అదే విధంగా ప్రసాదాల అసలైన రుచి, నాణ్యత, సాంస్కృతిక విలువలకు భంగం కలగకుండా వాటి నిల్వ కాలాన్ని పెంచేందుకు పరిశోధన ఆధారిత ప్యాకేజింగ్ విధానాలు, సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయనుంది.

సిబ్బందికి ప్రత్యేక శిక్షణ…

టీటీడీలో పనిచేసే ఆహార విశ్లేషకులు, ఆహార నిర్వహణ సిబ్బందికి ఆధునిక విశ్లేషణ పద్ధతులు, నమూనాల సేకరణ విధానాలు, కలుషిత పదార్థాల గుర్తింపు, నెయ్యి స్వచ్ఛత పరీక్షలు, సుగంధ లక్షణాల విశ్లేషణ వంటి అంశాలపై సీఎఫ్‌టీఆర్‌ఐ శాస్త్రవేత్తల బృందం శిక్షణ అందిస్తుంది.

నిపుణుల ప్రత్యక్ష పర్యవేక్షణ…

సీఎఫ్‌టీఆర్‌ఐకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు టీటీడీ ఆహార తయారీ, నిల్వ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించి, అమలు ప్రక్రియలు, ధృవీకరణ అధ్యయనాలు, నిల్వ, కొనుగోలు ప్రణాళికల మెరుగుదలకు మార్గనిర్దేశం చేస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా శ్రీవారి ప్రసాదాలు, టీటీడీ ఆహార సేవలు సంప్రదాయ పవిత్రతను కాపాడుకుంటూనే శాస్త్రీయ ప్రమాణాలతో మరింత నాణ్యంగా, భద్రంగా భక్తులకు అందించే ప్రయత్నం టీటీడీ చేస్తుంది.

Follow Us