
ప్రేమ అనేది రెండు మనసుల కలయిక అని, దానికి రూపం, ఎత్తు లేదా అందం వంటి కొలమానాలు ఉండవని మచిలీపట్నంలో జరిగిన ఒక వివాహం నిరూపించింది. సమాజం చూసే చిన్నచూపును పక్కన పెట్టి, తన మనసు మెచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్న ఒక యువతి ధైర్యం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం రాజుపేటకు చెందిన వేముల శశి, అదే ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి పరిచయం 9వ తరగతిలోనే స్నేహంగా మొదలైంది.
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ..!కాలం గడిచేకొద్దీ అది ప్రేమగా బలపడింది. శశి శారీరకంగా మరుగుజ్జు వ్యక్తి అయినప్పటికీ, అతడి వ్యక్తిత్వాన్ని ఇష్టపడిన ఆ యువతి, జీవితాంతం అతడితోనే ఉండాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం శశి జిల్లా కోర్టులో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తుండగా, యువతి ఒక మెడికల్ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
అయితే వీరి ప్రేమ వివాహానికి కులాలు, మతాలు అడ్డుగోడలుగా మారాయి. అన్నిటికంటే మిన్నగా శశి శారీరక స్థితిపై యువతి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్దల నుండి ప్రాణహాని, తీవ్రమైన ఒత్తిడి ఎదురవడంతో, ఈ జంట రహస్యంగా వివాహం చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ వారు ఇనుకుదురుపేట పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
ప్రేమ గుడ్డిది అంటారు. కానీ ఈ జంట ప్రేమకు మనసు ఉందని నిరూపించిందంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. అందం, ఆస్తి కంటే అనురాగమే ముఖ్యమని చాటిచెప్పిన ఈ యువతి నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..