
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న వివాదాలకే జనాలు 100 ఏళ్ల జీవితాన్ని ఆర్థాంతరంగా ఆపేసుకుంటున్నారు. పరిష్కరించుకునే గొడవలను సైతం పెద్దవిగా చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే బాపట్లజిల్లా వేటపాలెం మండలంలో వెలుగు చూసింది. కుటుంబ కళహాల నేపథ్యంలో రావురిపేట గ్రామానికి చెందిన భార్యభర్తలు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. మాజేటి ప్రభాకర్, పార్వతిలకు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 14 నెలల పాప కూడా వుంది. కాగా భర్త మాజేటి ప్రభాకర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కావడంతో ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. భార్య పార్వతి హైస్‌వైప్‌గా ఇంటిని చూసుకుంటుంది.
అయితే ఏం జరిగిందో, ఏమో తెలియదు కానీ మధ్యాహ్న సమయంలో భార్య పార్వతి తమ 14 నెలల పాపను పక్కింటి వారికిచ్చి చూస్తుండమని చెప్పి ఇంటికెళ్లింది. ఆ తరువాత చాలా సేపటి వరకు తిరిగి రాలేదు. అదే సమయంలో స్థానికంగా మీసేవ నిర్వహించే ప్రభాకర్ సోదరుడు ఇంటికి వచ్చి చూడగా తలుపులు ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి ..తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూశారు. బెడ్ రూంలో భార్య, బాత్ రూంలో భర్త ఉరివేసుకుని విగతజీవులుగా కనిపించారు.
అది చూసి ఒక్కసారిగా షాక్ అయిన అతను వెంటనే స్థానికులకు, తన అన్నయ్యకు సమాచారం ఇచ్చారు. అలాగే పోలీసులకు కూడా తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న చీరాల రురల్ సిఐ సుధాకర్ ,వేటపాలెం జనార్ధన్‌లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరపై ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు తప్ప ఆత్మహత్యలు చేసుకునేంత పెద్ద గొడవ కాదని బంధువులు చెబుతున్నారు. క్షణికావేశంలో భార్య ఆత్మహత్య చేసుకున్న తరువాత మనస్థాపానికి గురై భర్త కూడా బాత్ రూంలో ఉరివేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.