తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. అజ్ఞాత భక్తుడి భారీ కానుక వెనుక ఆసక్తికర విషయం!

121 Kg Gold Donation To Tirumala Temple: తిరుమల శ్రీవారికి ఓ అజ్ఞాత భక్తుడు ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించనున్నారు. కిరీటం, వడ్డాణం, శంఖుచక్రాలతో సహా 46 రకాల ఆభరణాలను తయారు చేయించారు. ఈ నెల 26న సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ భారీ కానుకను టీటీడీకి అందజేయనున్నారు. అసలు ఈ అజ్ఞాత భక్తుడు ఎవరు? ఈ ఆభరణాల ప్రత్యేకత ఏమిటి?

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. అజ్ఞాత భక్తుడి భారీ కానుక వెనుక ఆసక్తికర విషయం!
121 Kg Gold Donation To Tirumala Temple

Updated on: Nov 24, 2026 | 1:47 PM

121 Kg Gold Donation To Tirumala Temple: కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి అంటే భక్తులకు అపారమైన భక్తి. తమకు కలిగిన సంపదలో కొంత భాగాన్ని స్వామివారికి కానుకగా సమర్పించడం ద్వారా భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే, ఇప్పుడు ఓ అజ్ఞాత భక్తుడు శ్రీవారికి సమర్పించిన కానుక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 121 కిలోల బంగారంతో తయారు చేయించిన ఆభరణాలను స్వామివారికి కానుకగా అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) టీటీడీ చరిత్రలో ఒకే భక్తుడు ఇంత భారీ స్థాయిలో బంగారు ఆభరణాలను సమర్పించడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

చెన్నైకి చెందిన ఓ ఎన్నారై పారిశ్రామికవేత్త ఈ భారీ కానుకను సమర్పించారు. శ్రీవారి ఆశీస్సులతోనే తన వ్యాపారం అభివృద్ధి చెందిందన్న ఆయన.. కంపెనీ లాభాల్లో కొంత భాగాన్ని స్వామివారికి బంగారు ఆభరణాల రూపంలో సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లించారు. అయితే, తన దాతృత్వాన్ని ప్రచారం చేసుకోవడం ఇష్టంలేక పేరును గోప్యంగా ఉంచాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా తన వివరాలు బయటపెట్టవద్దని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

ఈ కానుకలో భాగంగా మొత్తం 121 కిలోల బంగారంతో 46 రకాల ఆభరణాలను తయారు చేయించారు. కిరీటం, భుజకీర్తులు, శంఖుచక్రాలు, వడ్డాణం, అభయహస్తాలు వంటి ఆభరణాలు ఇందులో ఉన్నాయి. వీటిని మొత్తం 9 సెట్లుగా రూపొందించారు. టీటీడీ అధికారుల సూచనలు, ఆగమ శాస్త్ర నిబంధనలను అనుసరిస్తూ సుమారు 15 నెలల పాటు అత్యంత నైపుణ్యంతో ఈ ఆభరణాలను తయారు చేసినట్లు సమాచారం. ప్రస్తుత బంగారం ధరలను బట్టి వీటి విలువ సుమారు రూ.140 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ప్రస్తుతం శ్రీవారి నిత్య అలంకరణల్లో ఉపయోగించే ఆభరణాల బరువు సుమారు 650 కిలోలుగా చెబుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త ఆభరణాలు కూడా వాటి జాబితాలో చేరనున్నాయి. చారిత్రకంగా రాజులు, చక్రవర్తులు, భక్తులు సమర్పించిన వజ్రకిరీటాలు, ముత్యాల హారాలు, విలువైన రత్నాభరణాలు తిరుమల సంపదలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి.

ఇక నవంబర్ నెల 26న సీఎం చంద్రబాబు తిరుమలకు వెళ్లనున్నారు. ఆయన సమక్షంలోనే అజ్ఞాత భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలను టీటీడీ అధికారులకు అందజేయనున్నట్లు సమాచారం. ఈ భారీ కానుక శ్రీవారి ఆభరణాల సంపదలో మరో ప్రత్యేక ఘట్టంగా నిలవనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us