
శ్రీవారి భక్తులు ఏడాదిగా ఎదురుచూస్తున్న ఆ శుభగడియలు రానేవచ్చాయి. తిరుమలలో ఈ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమవుతాయి. రాత్రి ఒంటిగంటన్నరకు ప్రొటోకాల్ వీఐపీలతో వైకుంఠ ద్వార దర్శనాలు మొదలవుతాయి. ఈ అర్ధరాత్రి నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి. మొదటి మూడు రోజులు ఈ-డిప్ టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికులకు లోకల్ కోటా కింద స్వామివారి దర్శనం కల్పిస్తారు. ప్రత్యేక అప్లికేషన్ ద్వారా రోజుకు 5వేల దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. ఆయా తేదీల్లో తిరుమలలో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఇక తమకు కేటాయించిన సమయంలోనే భక్తులు దర్శనానికి వస్తే.. ఇబ్బందులు తలెత్తవు అని సూచిస్తున్నారు TTD అధికారులు.
ఇక తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం కూడా..ముక్కోటి ఏకాదశికి ముస్తాబయింది. పట్టణంలో ఎటు చూసినా స్వాగత ద్వారాలు..చాందిని వస్త్రాలంకరణలు..విద్యుత్ దీపాలంకరణలతో రామాలయం పరిసరాలు ప్రకాశిస్తుస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శన భాగ్యం ఉంటుంది. శ్రీవైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం, వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనానికి అధికారులు పలు ఏర్పాటు చేశారు. స్వామివారి ఉత్సవాలు తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో భద్రాద్రి బాట పట్టారు. దీనితో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి.
వైకుంఠద్వార దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం VVIP, VIP, A, B, C, D, E సెక్టార్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక వైద్యశిబిరాలు, అత్యవసర వైద్యం కోసం అంబులెన్స్, ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక బెడ్లు, వైద్యనిపుణులను అందుబాటులో ఉంచారు. భక్తులకు నిరంతరం తాగునీటి వసతి కల్పించేలా ఏర్పాట్లు చేశారు. శానిటేషన్ సిబ్బందిని రప్పించి రౌండ్ ది క్లాక్ టౌన్‌ను శుభ్రం చేస్తున్నారు. గోదావరి తీరంలో భక్తులు నదిలోకి దిగకుండా బారికేడ్లు నిర్మించారు. గజఈతగాళ్లతో పాటు రెస్క్యూ టీమ్‌లను మోహరించారు. ప్రసాదాల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అదనంగా 2లక్షల లడ్డూలు తయారు చేయించారు. భక్తులు కోరుకున్న ప్రసాదం సకాలంలో అందజేసేలా ఏర్పాట్లు జరిగాయి. వైకుంఠ ద్వారం నుంచి వెళ్లే భక్తులకు, సర్వదర్శనం క్యూలైన్లలోని వారికి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
భద్రాచలం ఆలయంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ పర్యవేక్షించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుంటా 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్, బాంబ్ స్క్వాడ్‌లు నిరంతరం తనిఖీలు చేస్తున్నాయి. వీవీఐపీలు, వీఐపీలు వచ్చినప్పుడు, స్వామివారు తిరువీధి సేవకు వెళ్లేటప్పుడు భక్తుల రద్దీని నియంత్రించేందుకు రోప్ టీమ్‌లను సిద్ధం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..