Weather Alert: సుర్రుమంటున్న సూరీడు.. ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెగలు మొదలయ్యాయి. మార్చి నెల ముగియకముందే భానుడు భగభగమంటున్నాడు. ఈ నేపథ్యంలో అటు ఏపీ.. ఇటు తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

Weather Alert: సుర్రుమంటున్న సూరీడు.. ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
Smmer Heat

Updated on: Mar 28, 2026 | 9:51 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి.. 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా.. ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. వేసవి ఆరంభంలోనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. శనివారం ఏపీలోని 90 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ అంచనా వేస్తోంది. మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇటు తెలంగాణలోనూ క్రమంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్​ నగర్ జిల్లాలో ఎండలు దంచికొట్టే వీలుందని హెచ్చరించారు. దీంతో వికారాబాద్​, నారాయణపేట, మహబూబ్​నగర్​, జోగుళాంబ గద్వాల, నాగర్​ కర్నూల్​, వనపర్తి, సంగారెడ్డి జిల్లాల్లో కూడా 41 నుంచి 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని, ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్​ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్​ ప్రకటించింది. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఇంకెంతలా ముదురుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

జాగ్రత్తలు తీసుకోండి..

మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు ఎండ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా మంచి నీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us