ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై టీడీపీ సంచలన నిర్ణయం.. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన

|

Apr 02, 2021 | 4:57 PM

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబునాయుడు ప్రకటించారు.

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై టీడీపీ సంచలన నిర్ణయం.. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన
Chandrababu Naidu
Follow us on

TDP on AP ZPTC MPTC Elections:  ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ప్రకటించారు. అక్రమాలు జరిగిన ఎన్నికలనే కొనసాగిస్తున్నారని…ఎస్ ఈసి తీరును తప్పు పడుతూ ఎన్నికలను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఎస్‌ఈసీ నీలం సాహ్నిని టీడీపీ అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ఎస్‌ఈసీ వచ్చిరాగానే నిర్ణయం తీసుకోవడమేంటని ప్రశ్నించారు. అసలు ఎన్నికలు పెట్టే అర్హత కొత్త ఎస్‌ఈసీకి ఉందా అని నిలదీశారు. స్థానిక ఎన్నికలు రాజ్యాంగ బద్ధంగా జరగలేదని తప్పుబట్టారు. ఎన్నికలకు ముందే సీఎం, మంత్రులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని, నిబంధనలు పక్కనపెట్టి ఎన్నికలు జరుపుతున్నారని దుయ్యబట్టారు.

తాజా పరిస్థితుల్ని చూస్తుంటే కఠిన నిర్ణయాలు తప్పట్లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. పోటీ చేస్తామంటే బెదిరిస్తున్నారని రాష్ట్రంలో దౌర్జన్య పాలన సాగుతుందని మండిపడ్డారు. పరిషత్‌ ఎన్నికలపై గవర్నర్‌కు మాజీ ఎస్‌ఈసీ లేఖ రాశారని తెలిపారు. సంక్షేమ పథకాలు కట్‌ చేస్తామని బెదిరించి ఓట్లేయించుకున్నారని, ప్రశ్నిస్తే ఎర్రచందనం ఇళ్లలో పెట్టి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బలవంతంగా నామినేషన్లు విత్‌ డ్రా చేయించారని చంద్రబాబు ఆరోపించారు.

ఇందుకు నిరసనగా రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నామన్నారు. ఎన్నికల నుంచి తప్పుకోవడం పట్ల బాధ, ఆవేదన ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Read Also…  కాంగ్రెస్, డీఎంకేలు మహిళలకు భద్రత కరువు.. మధురై ప్రచార సభలో మండిపడ్డ ప్రధాని నరేంద్ర మోదీ