Andhra: కళ్యాణ వైభోగమే.. తణుకు అమ్మాయి, స్పెయిన్ అబ్బాయి ఒక్కటైన వేళ

ప్రేమకు భాషా భేదాలు, దేశాల సరిహద్దులు అడ్డుకావని మరోసారి నిరూపితమైంది. ఉన్నత విద్య కోసం స్పెయిన్ వెళ్లిన తణుకుకు చెందిన ప్రియదర్శిని.. అక్కడ పరిచయమైన మాడ్రిడ్ యువకుడు అమిన్ అల్ రహాద్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో తణుకులో తెలుగు సంప్రదాయాల నడుమ ఘనంగా జరిగిన ఈ వివాహం స్థానికంగా ఆకర్షణగా నిలిచింది.

Andhra: కళ్యాణ వైభోగమే.. తణుకు అమ్మాయి, స్పెయిన్ అబ్బాయి ఒక్కటైన వేళ
Cross Cultural Marriage

Edited By:

Updated on: Jul 26, 2026 | 10:40 AM

ప్రేమకు భాషా భేదాలు, దేశాల సరిహద్దులు అడ్డుకావని మరోసారి నిరూపితమైంది. ఏడేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం స్పెయిన్ వెళ్లిన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పాతవూరుకు చెందిన బొప్పనపల్లి ప్రియదర్శిని.. అక్కడ పరిచయమైన స్పెయిన్ యువకుడు అమిన్ అల్ రహాద్‌ను ప్రేమించి, చివరకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తణుకులోని స్థానిక సీఎం ఫంక్షన్ హాలులో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది.

ఏడేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు స్పెయిన్ వెళ్లిన ప్రియదర్శినికి.. మాడ్రిడ్‌కు చెందిన పీహెచ్‌డీ గ్రహీత అమిన్ అల్ రహాద్‌తో పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా ఆ పరిచయం ప్రేమగా మారింది. ఒకరి సంస్కృతిని, వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవించుకుంటూ జీవితాంతం కలిసి జీవించాలని నిర్ణయించుకున్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇరువైపులా కుటుంబాలు వారి నిర్ణయాన్ని హర్షిస్తూ అంగీకరించడంతో వివాహానికి మార్గం సుగమమైంది.

తండ్రి లేని లోటును అధిగమిస్తూ, ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూనే కుమార్తెను ఉన్నత చదువులు చదివించిన తల్లి భారతి.. ఆమె నిర్ణయాన్ని సంతోషంగా ఆమోదించారు. అలాగే అమిన్ కుటుంబ సభ్యులు కూడా ఈ బంధానికి ఆనందంగా అంగీకారం తెలపడంతో ప్రేమకథ పెళ్లి పీటల వరకు చేరుకుంది.

వివాహం కోసం అమిన్ కుటుంబ సభ్యులు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నుంచి ప్రత్యేకంగా తణుకు వచ్చారు. తెలుగు సంప్రదాయాల నడుమ జరిగిన ఈ వేడుకలో ఇరు దేశాల సంస్కృతుల కలయిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంధుమిత్రులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. విదేశాల్లో ప్రారంభమైన ఈ ప్రేమకథ తణుకులో ఘనమైన వివాహంతో కొత్త జీవితానికి నాంది పలుకుతూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.

 

Follow Us