AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: పాకల తీరానికి కొట్టుకువచ్చిన మరోబోటు.. మత్స్యకారుల్లో మళ్లీ కలకలం!

మురసు తుఫానులో చిక్కుకొని 9 మంది జాలర్లు మృతి చెందిన ఘటన మరువక ముందే.. ప్రకాశం జిల్లాలోని సముద్రతీరంలో మరో బోటు కొట్టుకురావడం కలకలం రేపింది. సింగరాయకొండ మండలం పాకల తీరానికి గుర్తుతెలియని బోటు చేరింది. పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉన్న ఈ బోటులో ఎవరూ లేకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల మురసు తుఫానులో చిక్కుకున్న బోటు ఘటన మరువకముందే మరో బోటు తీరానికి చేరడంతో అసలేం జరిగిందనే చర్చ మొదలైంది.

Andhra News: పాకల తీరానికి కొట్టుకువచ్చిన మరోబోటు.. మత్స్యకారుల్లో మళ్లీ కలకలం!
Prakasam Mystery Boat Washes Ashore
Fairoz Baig
| Edited By: |

Updated on: Nov 14, 2026 | 10:28 PM

Share

ప్రకాశం జిల్లాలోని సముద్రతీరానికి మరో గుర్తుతెలియని బోటు కొట్టుకురావడం స్థానికంగా కలకలం రేపింది. సింగరాయకొండ మండలం పాకల సముద్రతీరానికి పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఓ బోటు చేరింది. అయితే అందులో ఎవరూ లేకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల మురసు తుఫాను ప్రభావంతో సముద్రంలో చిక్కుకున్న బోటు అలల ఉద్ధృతికి కొట్టుకువచ్చి ఉంటుందని మత్స్యకారులు భావిస్తున్నారు.

తీరానికి చేరిన బోటులో చేపల వలలు సైతం కనిపించలేదు. దీంతో సముద్రతీరంలో కట్టేసి ఉంచిన ఖాళీ బోటు తుఫాను ప్రభావంతో సముద్రంలోకి వెళ్లి అలల తాకిడికి పాకల తీరానికి చేరి ఉండవచ్చని మరో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ బోటు తూర్పుగోదావరి జిల్లాకు చెందినదై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బోటు ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. బోటు యజమాని, దాని మూలాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

మురసు తుఫానులో 9 మంది జాలర్లు మృతి

ఇటీవల మురసు తుఫానులో చిక్కుకుని ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్రతీరంలో తమిళనాడుకు చెందిన బోటు నీట మునిగిన ఘటనను మత్స్యకారులు ఇంకా మర్చిపోలేదు. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న తొమ్మిది మంది జాలర్లు ప్రాణాలు కోల్పోయారు. ఏపీ కోస్ట్‌గార్డ్ అధికారి కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో మెరైన్ సిబ్బంది సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. మృతదేహాలను ఒంగోలు మార్చురీలో భద్రపరిచారు. వాటిని స్వగ్రామాలకు తరలించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు తమిళనాడు ఫైనాన్స్ మంత్రి విల్సన్, అక్కడి ఎమ్మెల్యే, ప్రభుత్వ ప్రతినిధులు ఒంగోలుకు చేరుకున్నారు. మృతదేహాలకు నివాళులర్పించారు. ఇప్పటివరకు ఏడుగురు జాలర్ల మృతదేహాలను గుర్తించగా, మరో ఇద్దరి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు.

మరో బోటు రాకతో మత్స్యకారుల్లో ఆందోళన

ఈ నేపథ్యంలో తాజాగా పాకల సముద్రతీరానికి మరో బోటు కొట్టుకురావడం మత్స్యకారుల్లో ఆందోళనకు కారణమైంది. సముద్రంలో ఇంకా ఎన్ని బోట్లు చిక్కుకున్నాయోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకల తీరానికి చేరిన బోటులో ఎవరూ లేకపోవడంతో అందులో ప్రయాణిస్తున్నవారు సముద్రంలో గల్లంతై ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే బోటులో చేపల వలలు లేకపోవడం, అది పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉండటంతో తీరంలో ఖాళీగా ఉన్న బోటు తుఫాను ప్రభావానికి సముద్రంలోకి కొట్టుకుపోయి ఉండవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. పోలీసుల విచారణ పూర్తయితేనే ఈ బోటు ఎక్కడి నుంచి వచ్చింది? దాని యజమాని ఎవరు? సముద్రంలో ఎవరైనా గల్లంతయ్యారా? అనే ప్రశ్నలకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us