Andhra News: ఆ రన్‌వేను మరో ప్రాంతానికి మార్చాలని రైతుల డిమాండ్.. ఢిల్లీకి చేరిన పంచాయతీ

ప్రకాశంజిల్లా సింగరాయకొండ దగ్గర జాతీయరహదారిపై రన్‌వే నిర్మాణం వివాదం ఢిల్లీకి చేరింది. ఇప్పటికే నిర్మించిన రన్‌వే వంకర టింకరగా ఉన్నందున స్ట్రయిట్‌గా నిర్మించేందుకు మరో 30 ఎకరాలు సేకరించేందుకు అధికారులు చేసిన ప్రతిపాదనను స్థానిక గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రన్‌వేను సింగరాయకొండ ప్రాంతం నుంచి కావాలి వైపుకు తరలించాలంటూ ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు చేశారు.తాజాగా స్థానిక గ్రామాల వ్యతిరేకతను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి వివరించి రన్‌వేను షిఫ్ట్‌ చేయాలని ఒంగోలు ఎంపి మాగుంట విజ్ఞప్తి చేయడంతో రన్‌వే నిర్మాణ వివాదం ఆశక్తికరంగా మారింది.

Andhra News: ఆ రన్‌వేను మరో ప్రాంతానికి మార్చాలని రైతుల డిమాండ్.. ఢిల్లీకి చేరిన పంచాయతీ
Prakasam District Runway Dispute

Edited By:

Updated on: Mar 13, 2026 | 7:24 PM

దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితులు, యుద్దాల సమయాల్లో జాతీయ రహదారిపై విమానాలు దిగేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ ప్రాంతంలో హైవేపై రన్‌వే నిర్మాణం ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ఈ నిర్మాణం వంకర టింకరగా ఉందన్న కారణంగా ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసి రహదారి నిర్మాణాన్ని స్ట్రయిట్‌గా మార్పు చేయాలని సూచించారు. ఇందుకు గాను మరో 30 ఎకరాలు సేకరించేందుకు స్థానిక అధికారులు సిద్దమయ్యారు. అయితే తాజా నిర్మాణానికి సంబంధించి భూసేకరణపై రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ నిర్మిస్తే తాము ఎంతగానో నష్టపో తామని, ప్రభుత్వం తమ భూములకు ఇచ్చే పరిహారం ఎంతమాత్రం యోగ్యం కాదని రైతులు చెబుతున్నారు. పలుమార్లు స్థానిక రైతులు, గ్రామస్థులు ఆందోళనలు చేశారు. ప్రస్తుతం ఈ పంచాయితీ దిల్లీకి చేరడంతో ఏం నిర్ణయం వెలువడుతుందనేది స్థానిక గ్రామస్థుల్లో చర్చకు దారితీసింది.

మరో 30 ఎకరాలు భూసేకరణ

16వ నంబరు జాతీయ రహదారిపై ప్రకాశంజిల్లా సింగరాయకొండ పరిధిలో కనుమళ్ళ రోడ్డు నుంచి కందుకూరు అండర్‌ పాస్‌ వరకు గతంలోనే నిర్మాణాలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి రెండు ప్రముఖ సంస్థలు తమ పనులు పూర్తి చేశాయి. అయితే ఈ రోడ్‌ కం రన్‌వే మాత్రం ఇంకా వినియోగంలోకి రాలేదు. కారణం కాంట్రాక్టర్ల నాసిరకం పనులు, రోడ్డు సక్రమంగా లేకుండా వంపులు తిరిగి ఉండటంతో ఇక్కడ రోడ్డును పరీక్షించిన ఎయిన్‌ఫోర్స్‌ అధికారులు మార్పులు చేయాలని సూచించారు. పగుళ్ళిచ్చిన రోడ్డును తొలగించి తిరిగి రోడ్డు నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. అలాగే 4కిలో మీటర్ల మేర స్ట్రయిట్‌గా ఉండాల్సిన రోడ్డు కొన్ని చోట్ల వంపులు ఉండటంతో ఆ ప్రాంతంలో భూసేకరణ చేసి స్ట్రయిట్‌గా రోడ్డు నిర్మించాలని సూచించారు.

ఇందుకోసం మరో 30 ఎకరాలు సేకరించాల్సి ఉందని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. అందుకోసం కేంద్రం నుంచి రూ. 75 కోట్ల నిధులు కూడా మంజూరు అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఉన్న రహదారికి ఇరువైపులా 3 నుంచి 10 మీటర్ల మేర భూమిని సేకరించాల్సి ఉంది. మొత్తం మీద 33 మీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. రెండువైపులా సర్వీసు రోడ్లు నిర్మించనున్నారు. ఇందుకోసం భూ సేకరణ చేసేందుకు ప్రతిపాదనలను ఇప్పటికే తహసీల్దారు రాజేష్ సర్వే చేసి నివేదిక పంపించారు.

రైతుల అభ్యంతరం.

సింగరాయకొండ జాతీయ రహదారి సమీపంలోని భూముల ధరలు ఇటీవల బాగా పెరిగాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రైతులతో ఒప్పందం చేసుకుని సెంటు భూమిని 2 లక్షల రూపాయల వరకు ధరలు నిర్ణయించి అమ్ముతున్నారు. గతంలో రన్‌వే కోసం భూములిచ్చిన రైతులు పక్కనే ఉన్న మరికొంత భూమిని ప్రస్తుతం రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులకు ఇచ్చి జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటున్నారు. ఈ సమయంలో తిరిగి 30 ఎకరాల భూమి కావాలని భూసేకరణ కోసం అధికారులు ప్రయత్నాలు ప్రారంభించడాన్ని స్థానిక రైతులు, గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు చేసి ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డికి తమ గోడు మొరపెట్టుకున్నారు.

రన్ వే మార్చాలని సింగరాయకొండ, కలికివాయి, మూలగుంటపాడు, కనుమళ్ల రైతులు కోరుతున్నారు. రన్‌వే నిర్మాణం విషయమై రైతుల ఇబ్బందులను తాజాగా ఎంపీ మాగుంట శ్రీనివాసు లురెడ్డి గురువారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థతో పాటు వైమానిక దళానికి చెందిన అధికారులతో కూడిన బృందం ఢిల్లీ నుంచి సింగరాయకొండకు వచ్చి అధ్యయనం చేస్తాయని గడ్కరి పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో ఇప్పటికైనా తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని స్థానిక గ్రామస్థులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us