Amaravati: అమరావతి క్విడ్‌ ప్రోకో కేసులో ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు

|

Jun 30, 2023 | 9:13 PM

Chandrababu: అమరావతి క్విడ్‌ ప్రోకో కేసులో సంచలన ఆదేశాలిచ్చింది ఏసీబీ కోర్ట్‌. కృష్ణానది కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ జప్తునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులిచ్చిన ఏసీబీ కోర్ట్‌, ఆస్తుల్ని విక్రయించొద్దని సూచించింది. అయితే, ఇదంతా చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే అంటోంది టీడీపీ.

Amaravati: అమరావతి క్విడ్‌ ప్రోకో కేసులో ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు
Lingamaneni Guest House
Follow us on

అమరావతి స్కామ్‌ కేసులో మరో కీలక పరిణామం ఇది. కృష్ణానది కరకట్టపై చంద్రబాబు ఉంటోన్న ఇల్లు ఇక ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లబోతోంది. క్విడ్‌ ప్రోకో అభియోగాలతో ఆల్రెడీ అటాచ్‌ చేసిన ఈ ఇంటిపై సంచలన ఆదేశాలిచ్చింది ఏసీబీ కోర్ట్‌. కరకట్టపై గెస్ట్‌హౌస్‌ను జప్తు చేసేందుకు అనుమతివ్వాలన్న సీఐడీ విజ్ఞప్తికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది న్యాయస్థానం. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి, వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు మధ్య క్విడ్‌ ప్రోకో జరిగిందనేది సీఐడీ ప్రధాన అభియోగం. భూ లావాదేవీల్లో లింగమనేనికి పెద్దఎత్తున లబ్ధి చేకూర్చి, అందుకు బదులుగా కరకట్ట గెస్ట్‌హౌస్‌ను చంద్రబాబు తీసుకున్నారనేది ఆరోపణ. అయితే, అసలా ప్రాపర్టీకి, చంద్రబాబుకి సంబంధమే లేదంటున్నారు టీడీపీ నేతలు.

అసలు, ఆ ఇంటితో టీడీపీకి, చంద్రబాబుకి ఏం సంబంధం అంటున్నారు మరో టీడీపీ నేత బోండా ఉమా. ఆ ఇల్లు లింగమనేని రమేష్‌ది, అతను ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్లారన్నారు. అయితే, ఈ కేసు వెనుక చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే కుట్ర మాత్రం ఉందన్నారు బోండా.

లింగమనేని గెస్ట్‌హౌస్‌తోపాటు నారాయణ ఆస్తుల్ని కూడా పాక్షికంగా జప్తు చేసేందుకు అనుమతిచ్చింది ఏసీబీ కోర్టు. ఈ ఆస్తుల్ని విక్రయించబోమంటూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలిచ్చింది. మరి, ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో! ప్రతివాదులు ఎలా స్పందిస్తారో చూడాలి!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం