RTC Bus Accident in Guntur: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ప్రమాదవశాత్తూ వంతెన రెయిలింగ్‌ను ఢీకొని ఆర్టీసీ బస్సు వాగులో పడింది. ఈ ఘటనలో పది మంది దుర్మరణం చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మరువకముందే.. గుంటూరు జిల్లా మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురికాగా.. తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయింది. బస్సు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బుధవారం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను – అప్పాపరం మధ్య కాల్వలోకి ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ కాల్వలోకి దూసుకెళ్లింది. బస్సు కమాన్ కట్టలు ఇరగటంతో బస్సు అకస్మాత్తుగా కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను 108లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా.. జల్లేరు బస్సు ప్రమాదం మరువక ముందే.. మరో ఆర్టీసీ బస్సు వాగులోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా.. ఆర్టీసీ బస్సుల వరుస ప్రమాదాలు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి.
జల్లేరులో బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
Also Read: