తాళపత్ర గ్రంధాలు ఎలా ఉంటాయో తెలుసా..? తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు కేంద్రం చర్యలు

Andhra Pradesh: తాళపత్ర గ్రంథాలంటే కేవలం భక్తికి సంబంధించినవి మాత్రమే అనే అపోహ వద్దు. ఇందులో ఖగోళ శాస్త్రం నుండి ఆయుర్వేదం వరకు అన్నీ ఉన్నాయి. ఎవరి దగ్గరైనా ఇవి ఉంటే జ్ఞాన భారత్ యాప్ ద్వారా మాకు సమాచారం ఇవ్వండి..

తాళపత్ర గ్రంధాలు ఎలా ఉంటాయో తెలుసా..? తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు కేంద్రం చర్యలు
Palm Leaf Manuscripts

Edited By:

Updated on: May 06, 2026 | 8:29 PM

Andhra Pradesh: వందల ఏళ్ల నాటి భారతీయ విజ్ఞాన సర్వస్వం.. తాళపత్రాల్లో నిక్షిప్తమైన అరుదైన రహస్యాలు.. ఇప్పుడు డిజిటల్ రూపంలోకి మారుతున్నాయి. కాగితం, కలం లేని రోజుల్లో మన పూర్వీకులు భద్రపరిచిన ఆ జ్ఞాన సంపదను కాపాడేందుకు ‘జ్ఞాన భారతం’ మిషన్ భారీ సర్వే చేపట్టింది.

​ఏఐ, డిజిటల్ యుగంలో ఒక్క క్లిక్ చేస్తే ప్రపంచమంతా అరచేతిలోకి వస్తోంది. కానీ వందల ఏళ్ల నాడు.. ఇతిహాసాలైనా, సకల శాస్త్రాలైనా, ఆయుర్వేద రహస్యాలైనా అన్నీ తాళపత్ర, తామ్ర పత్రాల్లోనే నిక్షిప్తమయ్యేవి. కాలక్రమేణా ఈ సంపద ప్రాధాన్యతను నేటి తరం మర్చిపోతోంది. కొన్ని మ్యూజియాలు, పాత గ్రంథాలయాలకే పరిమితమైన ఈ గ్రంథాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని కాపాడేందుకు సనాతన జీవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘జ్ఞాన భారతం’ మిషన్ నడుం కట్టింది.

​ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని లైబ్రరీలే లక్ష్యంగా ఈ సర్వే సాగుతోంది. విజయవాడలోని ప్రముఖ ఠాగూర్ గ్రంథాలయంలో రామాయణానికి సంబంధించిన యుద్ధకాండ, ఉత్తరకాండ ప్రతులు లభ్యమయ్యాయి. అటు చిత్తరంజన్ లైబ్రరీలో అరుదైన ఆయుర్వేద గ్రంథాన్ని గుర్తించారు. పీబీ సిద్ధార్థ కళాశాలలో ఐదు, ఓరియంటల్ లైబ్రరీలో మరికొన్ని మాన్యుస్క్రిప్ట్‌లను గుర్తించి వాటిని భద్రపరిచే ప్రక్రియను ప్రారంభించారు. కేవలం విజయవాడలోనే దాదాపు 500 నుంచి 600 తాళపత్ర గ్రంథాలు రిజిస్ట్రేషన్ అయ్యాయంటే మన దగ్గర ఎంతటి విజ్ఞానం ఉందో అర్థం చేసుకోవచ్చు.

​పరిరక్షణలో భాగంగా తాళపత్రాల జీవిత కాలాన్ని పెంచేందుకు నిపుణులు శాస్త్రీయ పద్ధతులను వాడుతున్నారు. మొదట దుమ్ము, ధూళి దులుపుతున్నారు. చెదలు పట్టకుండా స్పిరిట్ వాడుతూ.. పత్రాల మన్నిక కోసం ‘లెమన్ గ్రాస్ ఆయిల్’ (నిమ్మగడ్డి రసం) పూస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రతి పేజీని హై-రిజల్యూషన్ స్కాన్ చేసి ‘నేషనల్ రీపాజిటరీ’లో భద్రపరుస్తారు. తద్వారా రాబోయే వందల ఏళ్ల వరకు ఈ సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది.

Palm Leaf Manuscripts

తాళపత్ర గ్రంథాలంటే కేవలం భక్తికి సంబంధించినవి మాత్రమే అనే అపోహ వద్దు. ఇందులో ఖగోళ శాస్త్రం నుండి ఆయుర్వేదం వరకు అన్నీ ఉన్నాయి. ఎవరి దగ్గరైనా ఇవి ఉంటే జ్ఞాన భారత్ యాప్ ద్వారా మాకు సమాచారం ఇవ్వండి. మేము వాటిని డిజిటలైజ్ చేసి భద్రపరిచి, తిరిగి మీకే అప్పగిస్తామని
సనాతన ట్రస్టు ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఇందిర అంటున్నారు.

​మార్చి 16న ప్రారంభమైన ఈ సర్వే జూన్ 15 వరకు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 70 లక్షల పత్రాలను గుర్తించారు. ఎవరి దగ్గరైనా, ఏ ఇంట్లోనైనా ఇలాంటి ప్రాచీన పత్రాలు ఉంటే.. మధ్యవర్తులు లేకుండా నేరుగా జ్ఞాన భారత్ ట్రస్ట్‌ను సంప్రదించవచ్చు. మన వారసత్వ సంపదను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ మిషన్ కోరుతోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us