Andhra: 28 ఏళ్లుగా ఒక్కటే వినాయక విగ్రహం.. ఊరంతా ఒక్కటై పండుగ

ప్రకాశం జిల్లా ఒమ్మెవరం గ్రామంలో 28 ఏళ్లుగా వినాయక చవితికి ఒకే ఒక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కులాలు, వర్గాలకు అతీతంగా గ్రామస్థులంతా కలిసి పూజలు నిర్వహిస్తూ ఐక్యతను చాటుతున్నారు. 11 రోజుల వేడుకల అనంతరం జరిగే నిమజ్జనానికి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామస్థులు సైతం స్వగ్రామానికి చేరుకోవడం ప్రత్యేకతగా మారింది.

Andhra: 28 ఏళ్లుగా ఒక్కటే వినాయక విగ్రహం.. ఊరంతా ఒక్కటై పండుగ
Ommevaram Village Ganesh

Edited By:

Updated on: Sep 25, 2026 | 6:38 PM

వినాయక చవితి వచ్చిందంటే ఊరూవాడా సందడిగా మారుతుంది. వీధివీధినా వినాయక మండపాలు, రకరకాల విగ్రహాలు, ప్రత్యేక పూజలతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. కొన్నిచోట్ల పెద్ద విగ్రహాల ఏర్పాటుతో పోటాపోటీగా వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. కానీ ప్రకాశం జిల్లాలోని ఆ గ్రామంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన సంప్రదాయం కొనసాగుతోంది. ఏళ్లుగా గ్రామమంతా కలిసి ఒకే ఒక్క వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు.

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఒమ్మెవరం గ్రామంలో గత 28 ఏళ్లుగా వినాయక చవితికి ఒకే ఒక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కులాలు, వర్గాలకు అతీతంగా గ్రామస్థులంతా ఒక్కచోట చేరి వినాయకుడికి పూజలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకతగా మారింది. మూడు దశాబ్దాలకు చేరువైన ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ అదే ఐక్యతతో కొనసాగిస్తున్నారు.

ఈ ఏడాది కూడా గ్రామస్థులంతా కలిసి ఒకే వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం నిమజ్జనం చేస్తారు. గ్రామంలో జరిగే ఈ వేడుకకు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఒమ్మెవరం వాసులు కూడా స్వగ్రామానికి చేరుకోవడం ఆనవాయితీగా మారింది. దీంతో పండుగ సమయంలో గ్రామంలో సందడి మరింత పెరుగుతుంది.

ఒమ్మెవరం గ్రామంలో సుమారు 3 వేల మంది జనాభా ఉన్నారు. వీరిలో దాదాపు 80 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఉండగా.. మరికొందరు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. అయితే వినాయక చవితి వేడుకలు మాత్రం అందరినీ మళ్లీ స్వగ్రామానికి తీసుకొస్తున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పండుగను జరుపుకోవడంతో పాటు.. నిమజ్జన వేడుకల్లోనూ గ్రామస్థులంతా పాల్గొంటారు.

11వ రోజు నిర్వహించే నిమజ్జనం కోసం గ్రామం నుంచి భారీగా ట్రాక్టర్ల ర్యాలీ బయలుదేరుతుంది. ఉప్పుగుండూరు మీదుగా పెదగంజాం సముద్రతీరానికి చేరుకుని వినాయకుడి నిమజ్జనం నిర్వహిస్తారు. భక్తితో పాటు గ్రామస్థుల ఐక్యతను చాటేలా జరిగే ఈ వేడుక.. ఒమ్మెవరం ప్రత్యేకతగా నిలుస్తోంది.

ఏళ్లుగా ఒక్కో వీధికి ఒక్కో మండపం కాకుండా.. ఊరంతా కలిసి ఒకే వినాయకుడిని పూజించడం ఒమ్మెవరం గ్రామస్తుల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. అందుకే ఇక్కడ వినాయక చవితి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. గ్రామమంతా ఒక్కటయ్యే వేడుకగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us