MPTC Elections: ఒకే ఇంట్లో రెండు జెండాలు.. ఎన్నికల బరిలో తోటికోడళ్లు.. ఎక్కడంటే?

ఇంట్లో కలిసుండే తోటికోడళ్లు.. రాజకీయాల్లోకి వచ్చేసరికి పరస్పరం తలపడే ప్రత్యర్థులుగా మారితే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి రసవత్తర సమరానికే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేదికైంది. ఒకే ఇంటి తోటికోడళ్లు జనసేన, వైసీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగడం ఇప్పడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

MPTC Elections: ఒకే ఇంట్లో రెండు జెండాలు.. ఎన్నికల బరిలో తోటికోడళ్లు.. ఎక్కడంటే?
Sister In Law Face Off In Pedamallam Mptc Election

Edited By:

Updated on: Oct 23, 2026 | 6:54 PM

ఏలూరు : స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే పల్లెల్లో రాజకీయ వేడి రాజుకుంటుంది. పార్టీల మధ్య హోరాహోరీ పోరు సహజమే అయినా, ఒకే ఇంటికి చెందిన తోటి కోడళ్లు రెండు ప్రధాన పార్టీల తరఫున ప్రత్యర్థులుగా బరిలోకి దిగితే? అచ్చం అలాంటి ఆసక్తికర, రసవత్తర దృశ్యమే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు వేర్వేరు పార్టీల కండువాలు కప్పుకుని ఎన్నికల బరిలో తలపడుతుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

బోడపాటి వారింట్లో రాజకీయ సమరం

పెదమల్లం ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ల ఘట్టం ఉత్కంఠగా సాగింది. గ్రామానికి చెందిన బోడపాటి కుటుంబం ఇప్పుడు నియోజకవర్గంలోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఒకే ఇంటికి చెందిన తోటి కోడళ్లు ప్రత్యర్థి పార్టీల తరఫున నామినేషన్లు సమర్పించారు. బోడపాటి మంగాదేవి జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బోడపాటి సుప్రియ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తరఫున పోటీకి దిగారు. ఆచంట ఎంపీడీవో కార్యాలయంలో వీరిద్దరూ తమ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. కుటుంబ సభ్యులుగా ఇంట్లో కలిసుండే ఇద్దరు మహిళలు, ప్రజాక్షేత్రంలోకి వచ్చేసరికి సైద్ధాంతిక వైరుధ్యాలతో రాజకీయ ప్రత్యర్థులుగా మారడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

గ్రామస్తుల్లో తీవ్ర ఉత్కంఠ

ఒకే ఇంటికి చెందిన ఇద్దరు కోడళ్లు రంగంలో ఉండటంతో పెదమల్లం గ్రామ ఓటర్లలో గందరగోళంతో పాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కుటుంబ బంధాలు ఎలా ఉన్నా, రాజకీయాల్లో ఎవరికి వారే గెలుపే లక్ష్యంగా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఒకవైపు జనసేన కేడర్ మంగాదేవికి మద్దతుగా ప్రచారం మొదలుపెడుతుండగా, మరోవైపు వైసీపీ శ్రేణులు సుప్రియను గెలిపించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.బంధువులు, స్థానిక ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు? ఈ ‘తోటికోడళ్ల సమరం’లో పెదమల్లం ఓటరు దేవుళ్లు ఎవరిని గెలిపిస్తారో చూడాలి మరీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us