
ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంట అమ్మగా వచ్చిన లక్షన్నర రూపాయలు పోవడంతో ఓ రైతు గుండెల్లో గుబులు మొదలైంది. అయితే పోలీసుల చాకచక్యంతో ఆ నగదు మళ్లీ రైతు చేతికి చేరింది. సీసీ కెమెరాల ఆధారంగా డబ్బు తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తించి, నగదును స్వాధీనం చేసుకుని రైతుకు అప్పగించడంతో అతని ఆనందానికి అవధులు లేకపోయాయి.
నగరంలోని చుట్టుగుంటకు చెందిన రైతు మారిశెట్టి బ్రహ్మయ్య మిర్చి సాగు చేశాడు. తాను పండించిన పంటను విక్రయించి వచ్చిన రూ.1.50 లక్షలను మార్కెట్ సెంటర్‌లోని కమిషన్ ఏజెంట్ వద్ద నుంచి తీసుకుని ఒక సంచిలో పెట్టి బైక్‌కు తగిలించుకుని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్లిన తర్వాత సంచి కనిపించకపోవడంతో నగదు మార్గమధ్యంలో ఎక్కడో పడిపోయిందని గుర్తించి ఆందోళనకు గురయ్యాడు. వెంటనే లాలాపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
సీఐ శివప్రసాద్ ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు కిరణ్, శంకర్ మార్కెట్ సెంటర్ నుంచి రైతు వెళ్లిన మార్గంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎత్తురోడ్డులో ప్రయాణిస్తుండగా నగదు సంచి బైక్ నుంచి కింద పడిపోయినట్లు గుర్తించారు. అయితే ఆ విషయం తెలియక రైతు ముందుకు వెళ్లిపోయాడు. అనంతరం అదే మార్గంలో వచ్చిన ఓ వ్యక్తి ఆ సంచిని తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది.
సీసీ కెమెరాల్లో కనిపించిన బైక్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించి విచారించగా, నగదు తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అనంతరం నగదును పోలీసులకు అప్పగించాడు. సీఐ శివప్రసాద్ రైతు బ్రహ్మయ్యకు రూ.1.50 లక్షలను తిరిగి అందజేశారు. పోయిందనుకున్న డబ్బు తిరిగి చేతికి అందడంతో రైతు బ్రహ్మయ్య భావోద్వేగానికి గురయ్యాడు. తమ సమస్యను వెంటనే పరిష్కరించి, నగదును తిరిగి అందించిన లాలాపేట పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.