Pawan Kalyan: విజయ్‌తో తనను పోల్చడంపై రియాక్టైన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?
టీవీకే చీఫ్ విజయ్‌తో తనను పోల్చడంపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. విజయ్ గెలుపుతో తన గురించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కావాలనో, ఇంకేదో పదవులు కావాలని పార్టీ పెట్టలేదని.. కొత్తతరం నాయకత్వాన్ని తయారు చేయాలన్న ఆలోచన జనసేన స్థాపించామన్నారు.

తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే పార్టీ అధినేత విజయ్‌తో తనను పోల్చుతూ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్‌పై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తమిళనాడు పరిస్థితులు వేరు ఏపీలో పరిస్థితులు వేరని తెలిపారు. అందరూ తనను వదిలేసినా పార్టీని ముందుకు తీసుకెళ్లానన్నారు. జనసేన లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ పార్టీ కాదు.. వివిధ పార్టీల సిద్ధాంతాల నుంచి మంచి అంశాలతో పార్టీని స్థాపించామనని పవన్‌కల్యాణ్ చెప్పుకొచ్చారు. 2008నుంచే పార్టీని ఎలానడపాలో ప్రణాళికలు వేసుకున్నాన్నారు. జనసేన అనేది పాతికేళ్లుగా తనలో రగిలిన ఆలోచన అన్నారు. సీఎం అయిపోవాలని, ఇంకేదో పదవులు అనుభవించాలనో తాను పార్టీ పెట్టలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో జనసేన ప్రచారం చేసిన చోట NDA అభ్యర్థులు గెలిచారన్నారు పవన్‌కల్యాణ్.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం సందర్భంగా పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవే కాకుండా పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమి పార్టీల సమన్వయం వంటి కీలక అంశాలపై కూడా ఆయన మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు జనసేన సభ్యత్వం తీసుకోవడం, సమావేశాలకు తరలిరావడం గొప్ప విషయమన్నారు.
అలాగే, తన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా పవన్ కల్యాణ్ కార్యకర్తలకు వివరించారు. గతంలో కరోనా సోకడం వల్ల వచ్చిన లంగ్ ఇన్ఫెక్షన్ అలాగే ఉండిపోయిందని.. రాజకీయ పర్యటనల్లో దుమ్ము, ధూళి వల్ల మరికొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తాయని చెప్పారు. పర్యటనల్లో అభిమానులు ప్రేమతో రెండు వైపులా చేతులు పట్టి లాగడం వల్ల భుజాల మధ్య గ్యాప్ పెరిగి కొంత ఇబ్బందిగా ఉందన్నారు. స్పైన్ సమస్య, ఇతర ఇబ్బందులు ఉన్నప్పటికీ.. కార్యకర్తలు, అభిమానుల ప్రార్థనల వల్ల తాను బాగున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
