
పార్వతీపురం మన్యం జిల్లాలో క్షుద్రపూజల ఘటన కలకలం రేపుతుంది. కురుపాం గ్రామంలో హెయిర్ సెలూన్ షాప్ ముందు గుర్తుతెలియని వ్యక్తులు భయానక పూజలు చేశారు. అయితే ఎప్పటిలాగే ఉదయాన్నే గణపతి షాపు తెరిచేందుకు వెళ్ళాడు. అలా వచ్చిన గణపతికి ఊహించని షాక్ తగిలింది. షాప్ ముందు గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గులు వేసి అందులో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, గాజు పెంకులు, దీపాలు పెట్టి భయానక పూజలు కనిపించాయి. దీంతో గణపతి భయాందోళనకు గురయ్యాడు. ఉదయం షాప్ వద్దకు వచ్చిన గణపతి ఈ విషయాన్ని గుర్తించి స్థానికులకు సమాచారం అందించారు. దీంతో విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. అది చూసేందుకు షాప్ వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. షాప్ ముందు ఇలా పూజలు చేయడం ఏంటని, ఇదెవరో గిట్టని వారు చేసిన క్షుద్రపూజలు అని యజమానితో పాటు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ గ్రామంలో పలుమార్లు చోటు చేసుకున్నాయని కొంతమంది గ్రామస్తులు చెబుతున్నారు.
వరుసగా ఇటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. అయితే ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారు? ఎందుకు చేశారు? అనే విషయాలు మాత్రం తేలాల్సి ఉంది. జరిగిన ఘటనపై పోలీసులు దృష్టి సారించి, షాప్ పరిసరాల్లోని పరిస్థితులను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి ఘటనకు పాల్పడిన వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రామ ప్రజల్లో భయాందోళనలు కలిగించే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఘటనకు బాధ్యులను గుర్తించి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటన పై పోలీసుల విచారణ అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..