
అప్పుల భారం, కుటుంబ సమస్యలు ఓ రైతు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. మనస్తాపానికి గురైన రైతు తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో రైతుతో పాటు అతని కుమార్తె మృతి చెందగా.. కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనరసాపురానికి చెందిన శ్రీనివాసరావు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య లీలతో పాటు కుమార్తె లాస్య, కుమారుడు నిఖిల్ ఉన్నారు. లాస్య ఎనిమిదో తరగతి, నిఖిల్ నాలుగో తరగతి చదువుతున్నారు. శ్రీనివాసరావుకు సొంతంగా సుమారు 18 ఎకరాల భూమి ఉండగా.. మరో 25 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. దీనికి అదనంగా ఏపీ సరిహద్దులోని జగ్గయ్యపేట మండలం గండ్రాయి ప్రాంతంలో సుమారు 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే కొంతకాలంగా పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగినట్లు సమాచారం. పెట్టుబడులు, అప్పుల ఒత్తిడికి తోడు కుటుంబంలో కూడా విభేదాలు తలెత్తడంతో శ్రీనివాసరావు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కోదాడలోని వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న తన ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని గండ్రాయి పరిధిలోని వ్యవసాయ పొలానికి వెళ్లారు. అక్కడ ముగ్గురూ పురుగుమందు కలిసిన శీతల పానీయం తీసుకున్నట్లు సమాచారం.
కొద్దిసేపటికే శ్రీనివాసరావు, ఆయన కుమార్తె లాస్య అపస్మారక స్థితికి చేరుకున్నారు. కుమారుడు నిఖిల్ తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంటూ పొలం నుంచి బయటకు వచ్చిన సమయంలో స్థానికులు గమనించారు. బాలుడిని ప్రశ్నించడంతో జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు వెంటనే ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందారు. చికిత్స పొందుతూ లాస్య కూడా ప్రాణాలు కోల్పోయింది. నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
శ్రీనివాసరావు, లాస్య మృతదేహాలను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..