Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. తెల్లారేసరికి

బ్రతుకుతెరువు కోసం అప్పు చేసి కొన్న కొత్త ఆటో గంటల వ్యవధిలో మాయమైన ఘటన విజయనగరం జిల్లాలో కలకలం రేపింది. కొత్తవలస మండలం రెల్లి కాలనీలో నివసించే బంగారి అప్పలరాజు రూ.3.18 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆటోను పూజలు చేసి ఇంటి ముందు ఉంచగా, తెల్లవారుజామున అది కనిపించలేదు.

Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. తెల్లారేసరికి
Auto Theft

Edited By:

Updated on: Feb 26, 2026 | 8:22 AM

బ్రతుకుతెరువు కోసం గంపెడాశాలతో కొన్న కొత్త ఆటో గంటల వ్యవధిలో మాయమైన ఘటన విజయనగరం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం పంచాయతీ రెల్లి కాలనీలో జరిగిన ఆటో చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బంగారి అప్పలరాజు అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా అద్దె ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాను ఆటో నడుపుతూ సంపాదిస్తున్న సంపాదన అంతా అద్దె కట్టడానికే సరిపోతుండటంతో ఏదో విధంగా సొంతంగా ఆటో కొనాలని నిర్ణయించుకున్నాడు. ఆ అనుభవంతోనే ఈనెల 20వ తేదీన రూ.3,18,000 పెట్టి కొత్త ఆటోను కొనుగోలు చేశాడు. వాహనాన్ని కొత్తవలస కొండడాబా వ్యాకులమాత ఆలయం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు కూడా చేశాడు. అనంతరం రాత్రి ఇంటికి వచ్చి ఆటోను ఇంటి ముందే పెట్టి.. రాత్రి కుటుంబ సభ్యులు నిద్రించారు. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూడగా.. ఆటో కనిపించకపోవడంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.

అప్పు చేసి కొనుగోలు చేసిన ఆటో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మాయమైన ఘటనతో తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. వెంటనే కొత్తవలస పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించగా తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆటో పెందుర్తి వైపు వెళ్తున్నట్టు ఒక కెమెరాలో కనిపించింది. అయితే వాహనం నడుపుతున్న వ్యక్తిని గుర్తించడం సాధ్యపడలేదు. ప్రస్తుతం పోలీసులు ఆటో దొంగను గుర్తించేందుకు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. అప్పుల బారిన పడిన అప్పలరాజుకు ఈ ఘటన తీవ్ర వేదనకు గురి చేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే వాహనాలకు ప్రతి ఒక్కరు జిపిఎస్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చిన జిపిఎస్ సిస్టమ్ ద్వారా వాహనాలు దొంగిలించిన వెంటనే పట్టుకోవడం సులభతరం అవుతుందని అంటున్నారు పోలీసులు.

Also Read: ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన 

 

Loading...
Unable to load recommendations.
Follow Us