
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. వైజాగ్ నుంచి బెంగళూరుకు 34 మంది ప్రయాణికులతో మణికంఠ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బయలుదేరింది. అయితే బస్సు నెల్లూరు జిల్లా చిల్లకూరు జాతీయ రహదారిపై వరగలి క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఫైర్ అలారం మోగడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్దు పక్కన ఆపేసి ప్రయాణికులను బస్సు నుంచి కిందకు దించాడు.
అయితే కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో అది పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. డ్రైవర్ అప్రమత్తత కారణంగా ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
మరోవైపు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ట్రావెల్స్ యాజమాన్యం మరో బస్సును ఏర్పాటు చేసింది. అందులో ప్రయాణికులను తరలించారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో బస్సును క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.