ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజున నంద్యాల జిల్లాలో పెద్దపులి మృతి..

ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజున నంద్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నాగలూటి రేంజ్‌లో వృద్ధాప్యం కారణంగా T66Fగా గుర్తించిన ఆడ పెద్దపులి మృతి చెందింది. NTCA నిబంధనల మేరకు పోస్టుమార్టం నిర్వహించి తదుపరి చర్యలు చేపట్టినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజున నంద్యాల జిల్లాలో పెద్దపులి మృతి..
Tigress T66f

Edited By:

Updated on: Jul 30, 2026 | 1:34 PM

ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజున పర్యావరణ, వన్యప్రాణి ప్రేమికులను కలచివేసే ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నాగలూటి రేంజ్‌లో మునిమడుగు ఏరు సమీపంలో ఓ ఆడ పెద్దపులి మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. మృతి చెందిన పెద్దపులిని T66Fగా గుర్తించారు. ప్రాథమిక పరిశీలనలో వృద్ధాప్యం కారణంగానే అది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కొంతకాలంగా పులి సంచారాన్ని అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (NTCA) నిబంధనల ప్రకారం వన్యప్రాణి వైద్యుల బృందం పులి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో చిత్రీకరణతో పాటు అటవీశాఖ అధికారులు, సిబ్బంది సమక్షంలో పూర్తి చేశారు. అనంతరం నిబంధనల ప్రకారం పులి కళేబరాన్ని నిర్వీర్యం చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రపంచ పెద్దపులుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పులుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, అదే రోజున ఓ పెద్దపులి మృతి చెందడం వన్యప్రాణి ప్రేమికులను కలచివేసింది. అయితే ఈ ఘటనలో వేట, విషప్రయోగం లేదా ఇతర అనుమానాస్పద పరిస్థితులు ఏవీ లేవని, సహజసిద్ధమైన వృద్ధాప్యమే మరణానికి కారణమని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు.

ప్రతి సంవత్సరం జూలై 29న ప్రపంచ పెద్దపులుల దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా పులుల సంరక్షణ, వాటి నివాస ప్రాంతాల పరిరక్షణపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక పులుల జనాభా కలిగిన దేశంగా నిలుస్తుండగా, పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us