
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని భవ్య బుధవారం తెల్లవారుజామున బాత్రూంలో ఫినాయిల్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే గుర్తించిన తోటి విద్యార్థినులు సిబ్బందికి సమాచారం అందించారు. విద్యార్థినిని తొలుత కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుంచి ఆత్మకూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొత్తపల్లి మండలంలోని ఎం.లింగాపురానికి చెందిన తలారి రాజు, జయలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె భవ్య. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అక్కడ లభించినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
భవ్య మృతికి పాఠశాలలో విద్యార్థుల మధ్య కొనసాగుతున్నట్లు చెబుతున్న ‘లైక్ సిస్టర్’ అనే వ్యవహారమే కారణమని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు చెబుతున్న వివరాల ప్రకారం.. కొందరు బాలికలు పరస్పరం ప్రత్యేక అనుబంధంతో ఉండటాన్ని ‘లైక్ సిస్టర్’గా పిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరిని మరొకరు అక్కాచెల్లెళ్లుగా భావించుకోవడం అనే అర్థంలోనూ ఈ పదాన్ని ఉపయోగిస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో పరస్పరం ఇష్టపడే విద్యార్థులు ఇతరులతో మాట్లాడకూడదంటూ నిబంధనలు పెట్టుకోవడం, దాంతో మనస్పర్థలు, గొడవలు తలెత్తుతున్నాయని భవ్య బంధువులు ఆరోపిస్తున్నారు. భవ్య ఆత్మహత్య చేసుకునే స్వభావం ఉన్న అమ్మాయి కాదని, పాఠశాలలో అసలు ఏం జరిగిందో అధికారులు స్పష్టంగా వెల్లడించాలని వారు కోరుతున్నారు.
ఇదే పాఠశాలలో చదువుతున్న కొందరు విద్యార్థినులు కూడా ‘లైక్ సిస్టర్’ అనే వ్యవహారం చాలామంది మధ్య కొనసాగుతోందని ఆరోపిస్తున్నారు. గతంలోనూ కొంతమంది విద్యార్థులు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఈ విషయం ఉపాధ్యాయుల దృష్టికి కూడా వెళ్లిందని వారు పేర్కొంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. భవ్య మృతికి సంబంధించి సూసైడ్ నోట్ ఉందంటూ ప్రచారం జరుగుతుండగా.. ఆ లేఖ తమ కుమార్తె రాసింది కాదని ఆమె బంధువులు చెబుతున్నారు. ఎవరో రాసి సృష్టించిన లేఖగా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేఖలో విద్యార్థినికి ఆపరేషన్ జరిగిందని, కుట్లు వస్తున్నాయని ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కూడా వారు ఖండించారు. ఈ అంశాలపై పోలీసుల దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది.
విద్యార్థిని అసహజ మరణంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోంది. విద్యార్థిని మృతికి ‘లైక్ సిస్టర్’ వ్యవహారమే కారణమా.. లేక మరేదైనా కారణం ఉందా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. భవ్య మృతి నేపథ్యంలో పాఠశాలలోని సుమారు 230 మంది విద్యార్థినుల్లో ఇప్పటికే దాదాపు 200 మందిని తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లినట్లు సమాచారం. పాఠశాలలో చోటుచేసుకున్న ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.