Andhra News: అమ్మే.. అంబులెన్సై.. అనారోగ్యంతో ఉన్న బిడ్డను 7కి.మీ మోసుకెళ్లిన తల్లి

తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలని తల్లిదండ్రులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. అలాంటిది బిడ్డకు ఆపద వస్తే.. ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఎంతటి కష్టమైనా ఎదురించి తన బిడ్డను కాపాడుకోవాలని తాపత్రయపడుతుంది. అచ్చం ఇలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వాహన సౌకర్యం లేకపోవడంతో ఓ తల్లి అంబులెన్స్‌గా మారింది. తన బిడ్డను భుజాలపై ఎత్తుకుని సుమారు 7 కిలోమీటర్లు నడిచి ఆసుపత్రికి తీసుకెళ్లింది.

Andhra News: అమ్మే.. అంబులెన్సై.. అనారోగ్యంతో ఉన్న బిడ్డను 7కి.మీ మోసుకెళ్లిన తల్లి
Mother Carries Sick Daughter For 7 Km

Updated on: Nov 02, 2026 | 7:45 AM

అమ్మే అంబులెన్స్‌గా మారి అనారోగ్యంతో ఉన్న తన బిడ్డను భుజాలపై మోసుకుంటూ హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. శృంగవరపుకోట మండలంలోని దారపర్తి పంచాయతీ పరిధిలో ఉన్న పల్లపు దుంగాడ గిరిజన గ్రామానికి చెందిన జన్ని సుకరమ్మ, కన్నయ్య దంపతులకు సంపూర్ణ అనే 12 ఏళ్ల కుమార్తె ఉంది. ఇటీవల సంపూర్ణ అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామానికి వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

దీంతో చేసేదేమీ లేక సుకరమ్మే అంబులెన్స్‌గా మారింది. అనారోగ్యంతో ఉన్న తన కుమార్తె సంపూర్ణను భుజాలపై ఎత్తుకుని సుమారు 7 కిలోమీటర్లు నడుచుకుంటూ కొండ దిగువ ప్రాంతానికి చేరుకుంది. అక్కడి నుంచి ఆటోలో ఎస్‌.కోటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ కుమార్తెకు వైద్యం చేయించిన అనంతరం తిరిగి అదే విధంగా ఆమెను భుజాలపై మోసుకుంటూ ఇంటికి చేరుకుంది. బిడ్డను కాపాడుకోవాలనే ఆ తల్లి తపన అక్కడివారిని కదిలిస్తోంది.

ఎనిమిదేళ్లుగా పూర్తికాని రోడ్డు నిర్మాణం

పల్లపు దుంగాడ గ్రామానికి 6.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించేందుకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితమే రూ.4.90 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దీంతో అధికారులు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అయితే, నిర్మాణ పనుల కోసం అటవీశాఖ ఇచ్చిన గడువు ముగియడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.

ఆ తర్వాత నిర్మాణ వ్యయం పెరగడంతో రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.6.50 కోట్లకు చేరింది. దీంతో అధికారులు కొత్త అంచనాలతో ప్రతిపాదనలు పంపినప్పటికీ, ఇప్పటివరకు అనుమతులు రాలేదు. ఫలితంగా గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికైనా స్పందించండి.

వర్షాలు కురిసినప్పుడు గ్రామానికి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంటోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us