
Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వంలో ఫైళ్ల క్లియరెన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కఠిన వైఖరి స్పష్టం చేశారు. గతంలో ఫైళ్లు ఒక టేబుల్ నుంచి మరో టేబుల్‌కు వెళ్లేందుకు రోజుల తరబడి సమయం పట్టేదని, దాంతో ప్రభుత్వ సేవలపై నేరుగా ప్రభావం చూపేదన్నారు సీఎం. అధికార యంత్రాంగం వేగం పెరగకపోతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సాధ్యం కాదని హెచ్చరిస్తూ తాజాగా జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ వేదికగా మరింత స్పష్టమైన టైమ్‌లైన్ ప్రకటించారు. ఇకపై మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు, ఎస్పీలు.. ఎవరైనా సరే ఫైళ్లను 24 గంటల్లోపు క్లియర్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వంలో ఒక్కో ఫైల్ సగటున రెండు రోజుల్లో క్లియర్ అవుతోందని ఆర్టీజీఎస్ ముఖ్య కార్యదర్శి కాటమనేని భాస్కర్ వెల్లడించారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. రెండు రోజులు కూడా ఎక్కువేనని, గరిష్టంగా 24 గంటల్లోనే ఫైళ్లు క్లియర్ కావాలని ఆదేశించారు. ఈ-ఫైళ్ల వ్యవస్థ వచ్చిన తర్వాత రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి క్లియరెన్స్ రావడం సంతోషకరమే అయినా.. ఇంకా వేగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
పెద్ద సంఖ్యలో ఫైళ్లు వచ్చినా కూడా సీఎస్ సాయి ప్రసాద్ 3,870 ఫైళ్లను సగటున 10 గంటల్లో క్లియర్ చేయడంపై సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఇదే విధానాన్ని మిగతా అధికారులు కూడా అనుసరించాలని సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అత్యంత వేగంగా స్పందిస్తూ సగటున 2.49 గంటల్లో ఫైళ్లు క్లియర్ చేస్తున్నారని అధికారులు వివరించారు.
కొంతమంది కార్యదర్శులు మాత్రం ఒక్కో ఫైల్‌కు 5 నుంచి 6 రోజులు తీసుకుంటున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. జయలక్ష్మి, బాలసుబ్రహ్మణ్యం, ఆమ్రపాలి సహా పలువురు అధికారులు 24 గంటల్లోపు ఫైళ్లు క్లియర్ చేసేలా పని తీరు మార్చుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్లు కూడా ఫైళ్లపై ఎక్కువ సమయం తీసుకోవడం సరికాదని హెచ్చరించారు.
జిల్లా స్థాయిలో కూడా ఫైళ్ల క్లియరెన్స్ వేగం పెరగాలని సీఎం స్పష్టం చేశారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఒక్కో ఫైల్‌కు మూడు రోజులు తీసుకుంటుండగా.. ఆనంద్, అభిషిక్త్ కిషోర్, వెంకటేశ్వరన్ ఇద్దరు రోజులు తీసుకుంటున్నారని సమీక్షలో ప్రస్తావించారు. విజయనగరం ఎస్పీ దామోదర్ ఒక్కో ఫైల్‌కు 10 రోజులు తీసుకుంటున్నారని సీఎం పేర్కొన్నారు.
మన్యం జిల్లా కలెక్టర్ పనితీరుపై సీఎం చురకలు అంటించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్ లో ఆయన ప్రవేశ పెట్టిన ముస్తాబు అనే కార్యక్రమాన్ని ప్రశంసించిన సీఎం అదే శ్రద్ధ ఫైళ్ల క్లియరెన్స్ మీద కూడా చూపాలి అంటూ వ్యాఖ్యానించారు. అధికారులకు ఇచ్చిన బాధ్యతల్లో వేగం, సమర్థత రెండూ కనిపించాలని స్పష్టం చేశారు.
గత మూడు నెలలతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఫైళ్ల క్లియరెన్స్ సమయం 10 రోజుల నుంచి 2 రోజులకు తగ్గిందని ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. కలెక్టర్ల సదస్సుల్లో సీఎం స్వయంగా సమీక్షలు నిర్వహించడం వల్ల స్పష్టమైన మార్పు కనిపిస్తోందని చెప్పారు.
మ్యానువల్ ఫైళ్లు దాదాపుగా లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. జిల్లా స్థాయి నుంచి హెచ్ఓడీల వరకు తప్పనిసరిగా ఈ-ఫైళ్లనే రూపొందించాలని స్పష్టం చేశారు. టెక్నాలజీని పాలనలో విస్తృతంగా ఉపయోగించాల్సిందేనని, అయితే హ్యూమన్ టచ్ కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.
ఫైళ్ల క్లియరెన్స్ వేగంగా జరిగితేనే ప్రజలకు ప్రభుత్వ సేవలు త్వరగా అందుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో పనిచేయాలని, పాలనలో వేగం పెంచడమే ఇప్పుడు ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి