
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా గ్రామకంఠం భూములకు సంబంధించి నెలకొన్న రిజిస్ట్రేషన్ల ఇబ్బందులకు ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించింది. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. దీనివల్ల వంశపారంపర్యంగా వస్తున్న ఇళ్లు, ఖాళీ స్థలాల యజమానులకు భారీ ఉపశమనం లభించనుంది.
సాధారణంగా గ్రామాల్లోని నివాస ప్రాంతాలను ‘గ్రామకంఠం’గా పిలుస్తారు. వాస్తవానికి ఇవి ప్రభుత్వ భూములు కావు, కానీ వెబ్‌లాండ్ రికార్డుల్లో స్పష్టమైన సబ్-డివిజన్ లేకపోవడం వల్ల చాలా చోట్ల ఇవి 22A (నిషేధిత జాబితా)లో ప్రభుత్వ భూములుగా నమోదయ్యాయి. దీనివల్ల వారసత్వంగా వస్తున్న ఆస్తులను అమ్ముకోవాలన్నా, వేరొకరికి బదలాయించాలన్నా రిజిస్ట్రేషన్ శాఖ అంగీకరించేది కాదు. పైగా పాత ఇళ్లకు సంబంధించి లింకు డాక్యుమెంట్లు లేకపోవడం పెద్ద అడ్డంకిగా మారింది.
గ్రామీణ ప్రాంతాల వారికి ‘సెల్ఫ్ డిక్లరేషన్’
గ్రామాల్లోని ఖాళీ స్థలాలకు పన్ను రశీదులు కూడా లేని పక్షంలో, రిజిస్ట్రేషన్ పత్రంలోనే ‘స్వయం ధ్రువీకరణ’ (Self-Declaration) పొందుపరిచే వెసులుబాటు కల్పించారు. సదరు ఆస్తి తమకు వారసత్వంగా వచ్చిందని, దానిని తాము అనుభవిస్తున్నామని, అది 22A పరిధిలోకి రాదని యజమాని స్వయంగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని ఒత్తిడి చేయకూడదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామాల్లో, పట్టణాల్లోని పాత నివాస ప్రాంతాల్లో ఆస్తులు ఉన్న లక్షలాది మందికి లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా భూముల క్రయవిక్రయాలు సజావుగా సాగడమే కాకుండా, ఈ ఆస్తులపై బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం కూడా కలుగుతుంది. 2026 ఫిబ్రవరి 17న ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..