
తాను వదిలేసిన భార్యను పెళ్లి చేసుకున్నాడనే విషంలో అన్న తమ్ముడితో గొడవ పడగా.. కొడవలితో తమ్ముడు అతి దారుణంగా అన్నను హత్య చేసిన సంఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బిలకల గూడూరు గ్రామానికి చెందిన చెంచు తోట సుంకన్న, గొలుసన్న అనే ఇద్దరూ అన్నదమ్ములూ.. అయితే సుంకన్న గతంలో చోరీలకు పాల్పడుతూ జీవనం సాగించేవాడు.. దీంతో అతపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకు సుంకన్న తన స్వగ్రామమైన బిలకల గూడూరును వదిలి.. ఆళ్లగడ్డ మండలం బాచేపల్లికి షిఫ్ట్ అయ్యాడు.
దీంతో సుంకన్న ఆచూకీ కోసం పోలీసులు తరచూ అతని తమ్ముడైన గొలుసన్న ఇంటి వచ్చేవారు. అతని సమాచారం చెప్పాలని గొలుసన్నను అడిగేవారు. అయితే ఇలా తరచూ పోలీసులు తమ ఇంటికి రావడంతో విసిగిపోయిన గొలుసన్న ఈ నెల 10వ తేదీ సాయంత్రం సుంకన్నను ఊరికి పిలిపించి ఈ విషయాన్ని నిలదీశాడు. పోలీసులు ఇంటికి రావడం వల్ల నా పరువు పోతుందని అన్నతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
దానికి తోడు సుంకన్న తన మొదటి భార్యను వదిలిపెట్టగా ఆమెను గొలుసన్న పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలో కూడా ఇరువురి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఈ అన్నింటిని మనసులో పెట్టుకుని తమ్ముడు తన అన్నను అదే రోజు రాత్రి ఇంటి వద్ద కొడవలితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముసునూరు క్రాస్ రోడ్డు వద్ద గొలుసున్నను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ కిరణ్ కుమార్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.