
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఓ కుదుపు కుదిపేస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్డర్ ప్లాన్ ఇష్యూపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు పోలీసుల ముమ్మర దర్యాప్తు… మరోవైపు పొలిటికల్ ఫైట్‌తో నెక్ట్స్ ఏంటన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. రౌడీషీటర్ల వీడియోపై స్పందించిన కోటంరెడ్డి… తన హత్యకు నిజంగానే కుట్ర జరిగిందన్నారు. కుట్ర పన్నింది ఎవరో పోలీసులే తేల్చాలన్నారు. వైసీపీ నేతలు, రౌడీ షీటర్ల బెదిరింపులకు భయపడే ప్రసక్తేలేదని కోటంరెడ్డి స్పష్టంచేశారు.
కోటంరెడ్డి పెద్ద నాటకాల రాయుడంటూ మండిపడ్డారు వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి. రౌడీషీటర్ శ్రీకాంత్‌కి పెరోల్ ఇప్పించింది ఎవరో పోలీసులు తేల్చాలన్నారు. పెరోల్‌పై సమాధానం చెప్పకుండా డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఉన్న రౌడీషీటర్లందరూ కోటంరెడ్డితో తిరిగిన వాళ్లేనన్నారు కాకాణి.
ఇటు కోటంరెడ్డి కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోటంరెడ్డి ఆఫీస్‌కు భారీగా చేరుకున్న TDP శ్రేణులు… ఎస్పీ, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరాచకశక్తులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా.. ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.. అసలు సూత్రధారులను కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. కాగా.. నిన్ననే ముగ్గురు రౌడిషీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు .. వారి నుంచి పలు వివరాలను సేకరించారు. విచారణలో వారు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుని.. తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశామని.. పోలీసులు ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..