
అనంతపురం తాడిపత్రిలో మరోసారి టెన్షన్ నెలకొంది. పెద్దారెడ్డి, జేసీ మధ్య పంచాయితీ ఇప్పట్లో తెగేలా లేదు. హైకోర్ట్ పర్మిషన్‌తో ఈ మధ్యనే తాడిపత్రిలో అడుగుపెట్టిన పెద్దారెడ్డికి మరోసారి ఇబ్బందులు ఎదురయ్యాయి. అనంతపురంలో వైసీపీ నేత సూర్య ప్రభాకర్ బాబును పరామర్శించి తిరిగి తాడిపత్రి వస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. కొండాపురం దగ్గర పెద్దారెడ్డిని అడ్డగించి.. హైకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలన్నారు. ఐదు వాహనాల కంటే ఎక్కువ వాహనాల్లో వస్తున్నారని అభ్యంతర వ్యక్తం చేశారు పోలీసులు. మరోవైపు పెద్దారెడ్డి ఎక్కడికి వెళ్లాలన్నా తాడిపత్రి సీఐ అనుమతి తీసుకోవాలన్న ఆదేశాలను పట్టించుకోవడం లేదన్నారు. హైకోర్ట్ ఆదేశాలు పాటించడం లేదని.. పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు పోలీసులు.
పోలీసు బందోబస్తు ఏర్పాటుకు అయ్యే ఖర్చులు కేతిరెడ్డి పెద్దారెడ్డి నుంచి వసూలు చేయకుండా… ఎలా తిరగనిస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. బందోబస్త్ ఖర్చు వసూలు చేయాలని హైకోర్ట్ ఆర్డర్స్‌లో క్లియర్‌గా ఉందన్నారు. పోలీసులు బందోబస్తు ఖర్చులు పెద్దారెడ్డి నుంచి వసూలు చేయకుండా ఉంటే.. తాను అడ్డుకుంటానని హెచ్చరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
ఉద్రిక్తతల మధ్య పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లొద్దని ఆంక్షలు విధించారు పోలీసులు. దీంతో పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. చివరకు పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లకుండా ఆయన స్వగ్రామం తిమ్మంపల్లికి పంపించారు పోలీసులు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..