
రాజమహేంద్రవరం, ఆగస్ట్ 18: కాకినాడ అశోక్‌నగర్‌కు చెందిన తిల్లపూడి నూకరాజు (61) పిఠాపురం మండలంలో పంచాయతీరాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్నారు. సుమారు పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆయన వచ్చే జనవరిలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆదివారం అర్ధరాత్రి భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (38), మనుమడు రియాన్ష్ కార్తికేయరెడ్డి (10)తో కలిసి కారులో రాజమహేంద్రవరం వచ్చారు. రాజమహేంద్రవరం రైలు వంతెనపై కారు నిలిపిన అనంతరం నలుగురూ గోదావరిలోకి దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్థానిక మత్స్యకారుల సహాయంతో గాలింపు చేపట్టారు. ఈత వచ్చిన కార్తికేయ సుమారు 20 నిమిషాల పాటు నీటిలో ఈదుతూ ‘హెల్ప్’ అంటూ కేకలు వేశాడు. అతడి అరుపులు గమనించిన మత్స్యకారులు పడవలో బాలుడిని ఒడ్డుకు తీసుకొచ్చారు. కాలు, నడుముపై స్వల్ప గాయాలైన అతడికి పోలీసులు ఆసుపత్రిలో చికిత్స అందించి బంధువులకు అప్పగించారు. మిగిలిన ముగ్గురి కోసం అగ్నిమాపక శాఖ సిబ్బంది, గజ ఈతగాళ్లు ప్రత్యేక బోట్లతో గాలింపు చేపట్టారు. సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో నూకరాజు మృతదేహం రాజమహేంద్రవరంలోని దోబీఘాట్ వద్ద లభించింది.
నూకరాజు కుటుంబం తొలుత కాకినాడ నుంచి రాజమహేంద్రవరం మీదుగా కొవ్వూరు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. అప్పటివరకు డ్రైవర్ కారును నడిపినట్లు సమాచారం. అనంతరం తాము వెనక్కి వస్తామని చెప్పి డ్రైవర్‌ను పంపించేశారు. కొవ్వూరులో అల్పాహారం చేసిన అనంతరం నూకరాజు కుమార్తె సౌజన్య కారును నడిపినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి రాజమహేంద్రవరం వైపు తిరిగి వచ్చిన కుటుంబం వంతెనపై కారును నిలిపి గోదావరిలోకి దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబం గోదావరిలోకి దూకడానికి ముందు నూకరాజు రాసినట్లు చెబుతున్న లేఖలో షూటింగ్ కోచ్ షేక్ సాధిక్‌ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అతడి వేధింపులు, బెదిరింపులు భరించలేక కుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. తన అల్లుడు జులై 2న మృతి చెందిన తర్వాత సాధిక్‌ఖాన్ తమ కుమార్తెకు సహాయం చేస్తానని చెప్పాడని, అయితే తాము అంగీకరించలేదని నూకరాజు పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం తన కుమార్తెను బెదిరించి విలువైన వస్తువులు, బ్యాంకు ఖాతాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడని లెటర్‌లో పేర్కొన్నాడు.
తనను, మనవడిని చంపుతానని బెదిరించాడని, కుమార్తెను తీవ్రంగా వేధించాడని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలను కోరుతూ నూకరాజు తన లేఖలో తెలిపారు. ఈ లెటర్‌ను ఆదివారం రాత్రి 11.27 గంటలకు వాట్సాప్ ద్వారా సహోద్యోగులు, బంధువులకు పంపినట్లు సమాచారం.
సాధిక్‌ఖాన్ కాకినాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో షూటింగ్ కోచ్‌గా పనిచేసినట్లు సమాచారం. ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో అక్కడి నుంచి తొలగించారని పోలీసులు తెలిపారు. అనంతరం సొంతంగా అకాడమీ ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలం క్రితం సౌజన్యకు సాధిక్‌ఖాన్ పరిచయమయ్యాడని, ఆ తర్వాత ఆమెను వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న సాధిక్‌ఖాన్‌ను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ శివగణేశ్ తెలిపారు. సాధిక్‌ఖాన్ తరచూ తమ ఇంటికి వచ్చేవాడని, తన తల్లిని కొడుతూ గొడవ చేసేవాడని ప్రాణాలతో బయటపడిన కార్తికేయ పోలీసులకు చెప్పాడు. బంగారం, డబ్బులు, లాకర్ తాళాలు కూడా తీసుకున్నాడని తెలిపాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత వంతెన వద్దకు వచ్చామని, అందరూ దూకాలని తాత చెప్పాడని కార్తికేయ పేర్కొన్నాడు. తన తల్లి చేయి పట్టుకుని దూకడంతో ఆమెను వెనక్కి లాగేందుకు ప్రయత్నించానని, అయితే తాను కూడా నీటిలో పడిపోయానని చెప్పాడు. చిన్నతనంలో నేర్చుకున్న ఈతతో చీకట్లో ఈదుతూ సాయం కోసం కేకలు వేయగా మత్స్యకారులు తనను రక్షించారని వివరించాడు. కాగా నూకరాజు, మీనా దంపతుల కుమారుడు కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.