
కాకినాడ జిల్లాలోని దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. జూన్ 6న మధ్యాహ్నం 11:50 నిమిషాలకు పామాయిల్ తోటలో తండ్రి గణేష్ వద్ద వదిలిపెట్టిన జ్ఞానేశ్వరి, కొద్దిసేపటికే మాయమవడం మిస్టరీగా మారింది. కేవలం 35 నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందనే దానిపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
జూన్ 6న మధ్యాహ్నం 11:50 గంటలకు తండ్రి గణేష్ తన కుమార్తె జ్ఞానేశ్వరిని ఇంటి వద్ద విడిచిపెట్టి, ఆమె తనను అనుసరిస్తుందని భావించి తోటలోకి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అప్పుడు తల్లి భవాని ఇంట్లో మరో బిడ్డతో పనుల్లో నిమగ్నమై ఉన్నారు. 12 గంటల ప్రాంతంలో జ్ఞానేశ్వరి తండ్రి వెళ్లిన దారిలోనే ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత ఒక స్థానికుడు చిన్నారిని సమీప కొండ ప్రాంతంలో కుక్కతో కలిసి చూశానని, ఆమెను ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే కుక్క మొరగడంతో వెళ్లలేకపోయానని తల్లికి చెప్పాడు. జ్ఞానేశ్వరి తండ్రి వద్ద లేదని గ్రహించిన కుటుంబ సభ్యులు వెంటనే గాలింపు ప్రారంభించారు. ఆచూకీ లభించకపోవడంతో తుని రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి, వెంటనే 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్), డాగ్ స్క్వాడ్ బృందాలు పొదలు, బోరుబావులు, చెరువులు వంటి ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. డ్రోన్ కెమెరాల ద్వారా కొండ ప్రాంతాలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించడంతో పాటు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల బహుమతి కూడా ప్రకటించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి, థర్మల్ డ్రోన్లను ఉపయోగించి గాలింపును ముమ్మరం చేశాయి. 400 మందికి పైగా పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్, అటవీశాఖ సిబ్బందితో కూడిన 10 ప్రత్యేక బృందాలు 500 ఎకరాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మెటల్ డిటెక్టర్లను కూడా వినియోగించారు.
పాపతో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క మూడు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. అది విచిత్రంగా ప్రవర్తించడాన్ని గుర్తించిన పోలీసులు, చిన్నారి జాడను తెలుసుకునేందుకు సాయపడుతుందని భావించి దానికి జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చారు. కుక్క అడవి వైపు వెళ్లి తిరిగి వచ్చినా, జీపీఎస్ ఆధారంగా ఎలాంటి కీలక సమాచారం లభించలేదు. భారీ వర్షాల కారణంగా డ్రోన్‌తో గాలింపు చర్యలకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. కేసు దర్యాప్తులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క అనుకోకుండా మృతి చెందడం కేసును మరింత సందిగ్ధంలో పడేసింది. మృతి చెందిన కుక్కను పోస్టుమార్టం కోసం ఎన్. సురవరం ప్రభుత్వ పశువైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం పూర్తయినా, ఫోరెన్సిక్ నివేదిక రావడానికి సమయం పడుతుందని పోలీసులు తెలిపారు.
ఆరో రోజు ముగిసిన దర్యాప్తులో ఎటువంటి కీలక ఆధారం లభించకపోవడంతో పోలీసులు కొత్త కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. కిడ్నాప్ కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ కలహాల అనుమానాల నేపథ్యంలో చిన్నారి తండ్రి గణేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. మరోవైపు, చిన్నారిని జంతువులు ఎత్తుకెళ్లి ఉంటాయని అనుమానంతో పెద్దాపురం డీఎస్పీ ఏజీబీ తిలక్ ఆధ్వర్యంలో పాప చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో మాంసం ముక్కలు, స్పై కెమెరాలతో కూడిన బొమ్మలను ఏర్పాటు చేశారు. డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీనితో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల కాల్ డేటాను కూడా పోలీసులు సేకరించి విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు.