Pawan Kalyan: డిప్యూటీ సీఎంకు భారీ ఊరట..ఆ కేసు ఎత్తివేత..!

| Edited By: Velpula Bharath Rao

Nov 19, 2024 | 8:59 AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై గతంలో నమోదైన క్రిమినల్ కేసును ఎత్తివేస్తున్నట్లు గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ ఏ కేసు? ఎవరు పవన్‌పై ఫిర్యాదు చేశారు?

Pawan Kalyan: డిప్యూటీ సీఎంకు భారీ ఊరట..ఆ కేసు ఎత్తివేత..!
Guntur Special Court Dismissed Criminal Case Against Andhra Pradesh Deputy Cm Pawan Kalyan
Follow us on

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై గతంలో నమోదైన క్రిమినల్ కేసును న్యాయమూర్తి ఎత్తివేశారు. పవన్‌పై అభియోగాలను తొలగిస్తూ తాజాగా గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కేసు ఎత్తివేతకు గల కారణాలను న్యాయమూర్తి ఆర్. శరత్ బాబు వెల్లడించారు. వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారంటూ 2023, జులై 29 న గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేరుగా కోర్టుకు ఫిర్యాదు చేసారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పవన్ కల్యాణ్‌పై 499, 500 ఐసీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. తనపై కేసును కొట్టేయాలంటూ పవన్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం వాలంటీర్లను మరోసారి విచారించింది. తాజా విచారణలో తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు తెలపడంతో కేసును ఎత్తివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

వారాహి సభలో ..

అప్పట్లో పవన్ వారాహి సభలకు పెద్ద క్రేజ్ ఉండేది. జిల్లాల వారీగా ఆయన వారాహి యాత్రలు చేపట్టే వారు. ఆ క్రమంలో గత ఏడాది 2023, జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్ వాలంటీర్లు పై కొన్ని ఆరోపణలు చేశారు. కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారు. ఇళ్లలో మగవాళ్ళు లేని సమయంలో వెళ్తున్నారని, దండుపాళ్యం బ్యాచ్‌‌లా మారారని, ఆ వ్యవస్థపై సరైన జవాబుదారీతనం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వైఎస్సార్, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన కొంతమంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు.

పవన్‌పై ఫిర్యాదు చేయాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు

వాలంటీర్లుపై పవన్ కామెంట్స్, ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు..వీటి ఆధారంగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ అదే నెల 20న అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలిచ్చారు. దీంతో ప్రభుత్వమే డైరెక్ట్ చేయడంతో గుంటూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు న్యాయస్థానంలో ఫిర్యాదు చేసారు. ఆ మేరకు పవన్ కల్యాణ్ పై అప్పట్లో 499, 500 ఐసీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. తాజాగా పవన్ హైకోర్టును ఆశ్రయించడం, తిరిగి ఫిర్యాదు చేసిన వాలంటీర్లను కోర్టు విచారించడం, అందులో చేసిన సంతకాలు మావి కాదంటూ ఆ వాలంటీర్లు చెప్పడంతో పవన్‌పై కేసు ఎత్తివేస్తున్నట్టు న్యాయమూర్తి శరత్ బాబు తీర్పు ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి