Andhra: ఆదోనిలో కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఏదో తేడాగా కనిపించారు.. ఆపి చెక్ చేయగా
బంగారం ధర పెరిగే కొద్ది స్మగ్లింగ్ కూడా పెరుగుతోంది. ఆదోని పట్టణంలో పోలీసుల వాహనాల తనిఖీలో బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా రూ. 60 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న బంగారం అక్రమ రవాణాపై ఆదోని రెండో పట్టణ పోలీసులు దాడులు చేపట్టారు. సీఐ రాజశేఖర్రెడ్డి మంగళవారం వివరాలు వెల్లడించారు. ఆదోని పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న బంగారం వ్యాపారి అబ్దుల్ మునాఫ్ కుమారుడు మహమ్మద్ ఫజల్ స్థానిక షరాఫ్ బజార్‌లో బంగారం పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 21వ తేదీన
మహమ్మద్ ఫజల్ కడప జిల్లా పొద్దుటూరు పట్టణానికి వెళ్లి అక్కడ సుమారు రూ. 60 లక్షలు విలువ చేసే 600 గ్రాముల బంగారు బిస్కెట్లు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత తన ఇద్దరు మిత్రులతో కలిసి కారులో ఆదోనికి వస్తుండగా.. ఆదోని పట్టణం ఆస్పరి బైపాస్ రహదారి వద్ద కారు ఆపి పోలీసులు తనిఖీ చేయగా బంగారు బిస్కెట్లు గుర్తించారు. ఈ బంగారం బిస్కెట్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, బిల్లులు లేకపోవడంతో వాటిని సీజ్ చేశామన్నారు. ఆ బంగారం బిస్కెట్లను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించారని సీఐ వెల్లడించారు.