
రాజకీయాల్లో ఆయన ఓ ఫైర్ బ్రాండ్.. ఓటమి ఎరుగని నేతగా పేరు.. ఆయన పాచిక వేస్తే ప్రత్యర్థులు ఎంతటి వారైనా నిలబడలేరనేది పాలిటిక్స్‌లో టాక్. రాజకీయాల్లో అయినా.. పర్సనల్ లైఫ్‌లో అయినా ఆయనకు ఆయనే స్పెషల్. ఏ నిర్ణయం తీసుకున్నా.. ఎటువంటి కార్యక్రమం చేపట్టినా కాస్త డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. అందరి దృష్టి తమ వైపు ఆకర్షిస్తారు. తాజాగా.. తన జీవిత భాగస్వామితో మళ్ళీ నిర్వహించుకున్న వివాహ వేడుక అందరి చూపు అతని వైపు తిప్పింది. ఆయనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. తన నలభైయ్యేళ్ళ వివాహ వేడుక ఆయన మళ్ళీ ఓ రేంజ్ లో నిర్వహించుకున్నారు. తాళి కట్టి.. తలంబ్రాలు పోసి.. సెలబ్రేట్ చేసుకున్నారు. కొడుకు, కూతురు స్వయంగా దగ్గరుండి వేడుక చేశారు. మనవలు, మనవరాళ్లు, మంత్రి నారాయణ సహా.. బంధుమిత్రులు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరై ఆశీర్వదించారు.
మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు – శారదల 40వ పెళ్లి రోజు ఆనందోత్సాహాల మధ్య మంగళవారం (మార్చి 17) అంగరంగ వైభవంగా జరిగింది. భోగాపురం సన్ రె రిసార్ట్ లో జరిగిన కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. నాలుగు దశాబ్దాల ప్రేమకు ప్రతీకగా వీరి 40వ పెళ్లి రోజును కుమారుడు రవితేజ, కోడలు శరణి.. కుమార్తె పూజిత, అల్లుడు ప్రశాంత్‌లు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ బద్ధంగా వివాహ క్రతువును దగ్గరుండి నడిపించారు.
పసుపు దంచి.. సంగీత్, మెహందీ..
నలభైయ్యేళ్ళ క్రితం అదేరోజున గంటా శ్రీనివాసరావు, శారదలు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వారి 40వ వివాహ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో సోమవారం (మార్చి 16) పసుపు దంచడంతో పెళ్లి సందడి మొదలు కాగా, బంధువులు, స్నేహితుల నడుమ.. ప్రముఖ సినీ గాయకుడు ధనుంజయ్ నేతృత్వంలో సంగీత్.. ఆ తర్వాత మెహందీ జరిగింది. మంగళవారం హిందూ సంప్రదాయం ప్రకారం పురోహితులు సమక్షంలో వివాహ మహోత్సవాన్ని జరిపించారు.
ముహూర్తం ప్రకారం..
ఉదయం 11.11 గంటల ముహూర్తానికి తాళి కట్టిన అనంతరం దండలను మార్చుకున్నారు గంటా శ్రీనివాసరావు, శారదలు. కొడుకు, కూతురు, బందువులు, స్నేహితుల చప్పట్ల మధ్య వివాహ వేడుక జరిగింది. కొడుకు, మంత్రి నారాయణ అల్లుడైన గంటా రవితేజ.. సాంగ్ పాడి, స్టెప్పులేసి అలరించాడు. గంటా వియ్యంకులైన మున్సిపల్ మంత్రి నారాయణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, కొండ్రు మురళీ మోహన్, విష్ణుకుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పాతూరి నాగభూషణం, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, సినీ నటులు శ్రీకాంత్, అశోక్ కుమార్, ప్రముఖులు, బందువులు హాజరయ్యారై ఆశీర్వదించారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు లాంటి రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ వివాహ వేడుకకు పిలుపు అందుకుని హాజరై గంటా శ్రీనివాస దంపతులకు విష్ చేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ దంపతుల పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..