గోదావరి జిల్లా వాసులకు వెటకారంతో పాటు మమకారం కూడా ఎక్కివేనండి అనే నానుడి తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. ఇంటికి వచ్చిన అతిధులకు తిండి పెట్టి సంపేస్తారు.. అంటూ సరదాగా కామెంట్ కూడా చేస్తారు.. సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత గోదారొళ్ల ఇంట విందు.. పండగలు పర్వదినాల సందడి గురించి తరచుగా వీడియోలు సందడి చేస్తూనే ఉన్నాయి. ఇక సంక్రాంతి సమయంలో కొత్త అల్లుడికి చేసే మర్యాదల గురించి ఎంత చెప్పినా తక్కువే.. సంక్రాంతి పండక్కి ప్రతి ఏడూ అల్లుడు అత్తారింటికి వెళ్లాల్సిందే.. అతిథి మర్యాదలు అందుకోవాల్సిందే.. తాజాగా అల్లుడికి, కూతురికి 408 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేసిన ఔరా అనిపించుకున్నారు అత్త మామలు.
సంక్రాంతి పండుగకు అల్లుడిని, కూతురిని ఆహ్వానించి అతిధి మర్యాదలతో సత్కరించి పెండ్లి జరిగి 408 రోజులు కావడంతో 408 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. అంతేకాదు మోయలేనన్ని కానుకలను ఇచ్చి అల్లుడికి, కూతురికి పండగ మర్యాదలు అంటే ఇలా ఉండాలి అనే విధంగా తెలియ చెప్పారు అత్తమామలు. గత సంవత్సరం Sep 2వ తేదీ 2023 లో జరిగిన పెండ్లి ఏర్పాట్లు మరువక ముందే 408 రకాల పిండి వంటలు విందు భోజనం ఏర్పాటు చేయటం మరొక వింతగా చెబుతున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు గ్రామానికీ చెందిన ప్రముఖ వ్యాపారి కాసు శ్రీనివాసు, శ్రీమతి భవాని దంపతుల కుమారుడు కాసు సుకేష్ ని గత ఏడాది నర్సాపురం గ్రామానికి చెందిన చుండూరి సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మి దంపతులు కుమార్తె శ్రీరంగ నాయకి పెళ్లి జరిగింది. వివాహం జరిగి 408 రోజులు అవ్వడంతో తమ అల్లుడిని కూతురిని సంక్రాంతి పండగ పిలిచారు. రోజుకు ఒక రకం చొప్పున 408 రకాల పిండి వంటలతో విందుని ఇచ్చారు. ఈ ఘనమైన విందు తెలుగు రాష్ట్రాల్లో కనువిందు చేస్తుందనే చెప్పాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..