
కర్లపాలెం, ఫిబ్రవరి 11: దేశం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని చెప్పుకునే రోజుల్లో కూడా.. ఒక మృతదేహాన్ని గౌరవంగా ఇంటికి తరలించే కనీస సదుపాయం లేకపోవడం బాపట్ల జిల్లాలో తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. కర్లపాలెం మండలంలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాపట్ల జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఈ సంఘటన జరగడం మరింత బాధాకరం. కర్లపాలెం మండలం చింతయపాలెం పంచాయతీ రాళ్లచెరువుకు చెందిన నక్క నాగేశ్వరరావుకు అకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు, సోదరులు ఆయనను ద్విచక్ర వాహనంపై బాపట్ల ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే నాగేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని గ్రామానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఆటోను సంప్రదించారు. అయితే ఆటో డ్రైవర్ మూడు వేల రూపాయల వరకు అడిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత మొత్తం చెల్లించే స్తోమత లేకపోవడంతో చివరికి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనతోనే మరో మార్గం లేక మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపైనే ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆసుపత్రి నుంచి గ్రామం వరకు సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ, మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ పరంగా గానీ, స్థానిక పరంగా గానీ సరైన వాహన సదుపాయం లేకపోవడం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన మహాప్రస్థానం వంటి మృతదేహ రవాణా వాహనాలు అందుబాటులో లేవా? అనే ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద కుటుంబాలు ఇలాంటి పరిస్థితుల్లో మరింత ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఉచితంగా మృతదేహ రవాణా సేవలు అందించాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా.. అతడిని గౌరవంగా ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితి ఉండటం మన సమాజానికి, మన వ్యవస్థకు తలవంచే విషయం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.