Andhra Pradesh: ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ.. కట్ చేస్తే..

ఖాకీ డ్రెస్ లేదు.. చేతిలో లాఠీ లేదు.. కానీ మేము మఫ్టీ పోలీసులమంటూ నమ్మించారు. మీ బైక్‌లో గంజాయి ఉందంటూ బెదిరించి, తనిఖీల పేరుతో రైతులు, వృద్ధుల సొమ్మును లూటీ చేశారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో గంజాయి తనిఖీల పేరుతో దౌర్జన్యాలకు పాల్పడుతున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. ఈ ముఠాలో ఒకరు దేశాన్ని రక్షించే బీఎస్ఎఫ్ మాజీ కానిస్టేబుల్ కావడం గమనార్హం.

Andhra Pradesh: ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ.. కట్ చేస్తే..
Fake Police Robbery In Tenali

Edited By:

Updated on: Jul 14, 2026 | 8:52 PM

అమాయక ప్రజలను, రైతులను టార్గెట్ చేస్తూ మఫ్టీలో ఉన్న పోలీసులమంటూ గంజాయి తనిఖీల పేరుతో దౌర్జన్యంగా డబ్బులు దోచుకుంటున్న ఇద్దరు కేటుగాళ్లను తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు సరిహద్దు భద్రతా దళంలో కానిస్టేబుల్‌గా పనిచేసి రావడం గమనార్హం. ఈ నిందితుల నుండి రూ.57,000 నగదు, ఒక పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెనాలి డీఎస్పీ జనార్ధనరావు మీడియాకు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠా తెనాలి పరిసర ప్రాంతాల్లో వరుస దోపిడీలకు పాల్పడింది. కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన మల్లిఖార్జున రెడ్డి అనే రైతు ఈ నెల 7న నందివెలుగు వెళ్లి ధాన్యం అమ్మగా వచ్చిన చెక్కును తెనాలిలోని బ్యాంక్‌లో మార్చుకున్నారు. ఆ నగదు రూ.1,60,000ను తన బైక్ డిక్కీలో పెట్టుకుని ఇంటికి బయలుదేరారు. ఆయన తెనాలి ఆటో నగర్ సమీపానికి వచ్చేసరికి పల్సర్ బైక్‌పై వేగంగా దూసుకొచ్చిన ఇద్దరు యువకులు రైతు బైక్‌ను అడ్డుకున్నారు. తాము మఫ్టీ పోలీసులమని.. ఆయన బైక్‌లో గంజాయి రవాణా అవుతున్నట్లు సమాచారం ఉందని బెదిరించారు. బైక్ తాళాలు లాక్కొని డిక్కీ మొత్తం సోదా చేశారు. ఈ క్రమంలో డిక్కీ కవర్‌లో ఉన్న రూ.1.60 లక్షల నగదు నుండి రైతు కళ్లు గప్పి రూ.50,000 నొక్కేశారు. ఆ తర్వాత గంజాయి దొరకలేదంటూ అక్కడి నుండి తోకముడిచారు.

వృద్ధుడిపై గంజాయి నెపం.. రూ.7 వేలు దోపిడీ

ఇదే తరహాలో దుగ్గిరాల పోలీస్ స్టేషన్ పరిధిలో టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై వెళ్తున్న ఫారూక్ అనే వృద్ధుడిని కూడా ఈ ముఠా అడ్డుకుంది. తాము పోలీసులమని నమ్మించి, గంజాయి రవాణా చేస్తున్నావంటూ బెదిరింపులకు దిగారు. వృద్ధుడిని భయభ్రాంతులకు గురిచేసి ఆయన వద్ద ఉన్న రూ.7,000 నగదును లాక్కొని పారిపోయారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. టెక్నాలజీతో చెక్..

బాధితుల ఫిర్యాదుతో అలర్ట్ అయిన తెనాలి పోలీసులు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను పక్కాగా గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితులు బాపట్ల జిల్లా చీరాలకు చెందిన కిరణ్, మురళిగా తేలింది. వీరిలో మురళి గతంలో బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేశాడు. అక్కడ నుండి వచ్చిన తర్వాత చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో పాత నేరస్థుడైన కిరణ్‌తో జతకట్టాడు. కిరణ్‌పై ఇప్పటికే వేర్వేరు స్టేషన్లలో 12కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి.

పలు జిల్లాల్లో కేసుల చరిత్ర..

నిందితులిద్దరూ గతంలో జైలుకు వెళ్లి వచ్చినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని డీఎస్పీ తెలిపారు. వీరిపై గుంటూరు, చీరాల, వేటపాలెం, ఇంకొల్లు, ఒంగోలు, నందిగామ తదితర పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయి. మఫ్టీలో ఉన్నామంటూ ఎవరైనా వచ్చి తనిఖీల పేరుతో బెదిరింపులకు దిగితే ఐడెంటిటీ కార్డులు అడగాలని, అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Follow Us