
మొన్నటి వరకు మొంథా తుఫాన్ ఏపీని అతలాకుతలం చేస్తే ఇప్పుడు దిత్వా తుఫాన్ దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర శ్రీలంక ప్రాంతాల్లో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతోంది. తుఫాన్ ప్రస్తుతానికి కారైకల్ కి 100 కిలో మీటర్లు, పుదుచ్చేరికి 190 కిలో మీటర్లు, చెన్నైకి 290 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో ఉత్తరం వైపు కదులుతోంది. రాబోయే 3 గంటల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మెరుపులతో కూడిన తేలికపాటి ఉరుములు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తుఫాన్ ఉత్తర-వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి ఆదివారం తెల్లవారుజామున విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దిత్వా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తాలో పలుచోట్ల రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తాలో అనేకచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండుచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశముంది.
రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తుపాను దృష్ట్యా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ప్రకాశం, కడప, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి