
దివ్యాంగుడిపై కత్తితో దాడి చేసి దోపిడి చేసిన ఘటన గుంటూరులో కలకలం రేపింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన చినబాబు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఎంఏ, బీఈడి పూర్తి చేసిన చినబాబు పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకునేందుకు గుంటూరు వచ్చాడు. ఈ క్రమంలోనే ఈస్ట్ ప్యారిస్ చర్చ్ ఫాస్టర్ పరిచయం అయ్యారు. పుట్టుకతోనే దివ్యాంగుడు కావడం, ఎంఏ, బిఈడి పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న చినబాబుకు ఆర్ధిక సాయం చేసేందుకు పాస్టర్ ముందుకొచ్చారు. శిక్షణకు అవసరమైన ఆర్ధిక సాయం సమకూరుతుందని భావించిన చినబాబు ఈనెల 15 సాయంత్రం ఖమ్మం నుండి ట్రెయిన్‌లో గుంటూరు చేరుకున్నాడు. అయితే అప్పటికే రాత్రి పదిన్నర గంటలైంది. ఆ సమయంలో చర్చ వద్దకు వెళ్లి చూడగా తాళాలు వేసి ఉన్నాయి. దీంతో చినబాబు దగ్గర్లో ఉన్న దర్గా వద్దకు వెళ్లి అక్కడే రెస్ట్ తీసుకున్నాడు.
తెల్లవారుజామున మేల్కొన్న చినబాబు దర్గా వద్ద నుండి చర్చ్ వద్దకు వచ్చాడు. అయితే అప్పటికీ ఇంకా చర్చ్ తలుపులు తీయలేదు. దీంతో బయటే వెయిట్ చేస్తున్నాడు. దివ్యాంగుడు కావడంతో నడవలేడు. చేతుల సాయంతోనే నడుస్తుంటాడు. చినబాబు చర్చ్ బయట వెయిట్ చేస్తుండగా అక్కడకి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. డబ్బులివ్వాలంటూ డిమాండ్ చేశారు. తన వద్ద డబ్బులు లేవని చెప్పినా వినకుండా చినబాబుపై కత్తితో దాడి చేశారు. దీంతో చినబాబు తన వద్ద ఉన్న 350 రూపాయలను తీసుకొని అక్కడ నుండి పారిపోయారు. స్థానికుల సాయంతో చినబాబు నగరం పాలెం పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..