
అర్నబ్ తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది.. దీంతో తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేశారు. కాసేపటి నుంచి అతి తీవ్ర తుఫాన్‌గా కొనసాగుతున్న అర్నబ్ తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోంది. గంటకు 3 కి.మీ. వేగంతో కదులుతున్న తుఫాన్.. యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. రాబోయే 3 గంటల్లో 150 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. కాకినాడ, యానాం ప్రాంతాల్లో ఉప్పెన ముప్పు ఉండగా, సాధారణం కంటే 2.5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉంది. అర్నాబ్ అతి తీవ్ర తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని .. బాపట్ల సమీపంలోని నర్సాపురం ప్రాంతంలో తుఫాన్ తీరం దాటుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ డాక్టర్ పి.ఎల్.ఎన్. మూర్తి తెలిపారు. మందగించిన తుఫాన్ తీరం దాటే ప్రక్రియ మధ్యాహ్నంలోగా పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. తీరం దాటిన తర్వాత కూడా గాలులు, వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
వాతావరణ శాఖ అధికారి రత్నకుమారి TV9తో మాట్లాడుతూ, ప్రస్తుతం అతి తీవ్ర తుఫాన్ కొనసాగుతోందని తెలిపారు. మరికొన్ని గంటల్లో ఇది బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని, పూర్తిగా తీరం దాటేందుకు మరో రెండు గంటలు పట్టొచ్చన్నారు. ఈరోజు రాత్రిలోపు వర్షాల ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు.
ఏపీలో ఈరోజు రెడ్ అలర్ట్ జిల్లాలు: విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లా, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణ, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలు రెడ్ అలర్ట్ లో ఉన్నాయి.. రెడ్ అలెర్ట్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కురిసే అవకాశం
ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు : శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, విజయనగరం, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది.. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ తో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. దీంతోపాటు కోస్తా జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉందని.. అలర్ట్ గా ఉండాలని సూచనలు జారీ చేశారు. తుపాన్ నేపథ్యంలో దాదాపు అన్ని జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
తెలంగాణపై కూడా అర్నబ్ తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, ములుగులో అత్యంత భారీవర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలతోపాటు సూర్యాపేట జిల్లాకు భారీ వర్ష సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు..
అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీతోపాటు.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సెలవులు ప్రకటించారు. ఏపీలోని పలు జిల్లాల్లో సెలవులు కొనసాగుతుండంగా.. భద్రాద్రి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.