ఏలూరు ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. ఆరోగ్య శాఖ మంత్రి ఫోన్.. అసలేం జరిగిందంటూ ఆరా..

|

Dec 06, 2020 | 10:30 AM

ఏలూరు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి ఫోన్ చేసి..

ఏలూరు ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. ఆరోగ్య శాఖ మంత్రి ఫోన్.. అసలేం జరిగిందంటూ ఆరా..
Follow us on

ఏలూరు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి ఫోన్ చేసి.. ఘటన తాలూకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలంతా ఆకస్మికంగా అనారోగ్యానికి గురి కావడంపై ఆరా తీశారు. వ్యాధి లక్షణాలను పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఏలూరుకు వైద్య బృందాలను పంపిస్తున్నామని, ఆ బృందాలు నేడు ఉదయం ఏలూరుకు వస్తాయని సీఎం జగన్.. వైద్య మంత్రికి తెలిపారు. ఈ ప్రత్యేక వైద్య బృందాలు.. అనారోగ్య పరిస్థితులకు గల కారణాలను క్షణ్ణంగా పరిశీలిస్తాయని చెప్పారు. ప్రజలెవరూ భయాందోళన చెందవద్దని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు రాకుండా నిపుణులు అయిన వైద్య బృందాలతో పరీక్షలు చేయిస్తామన్నారు. అవసరం అయితే మెరుగైన వైద్య సదుపాయం కల్పించడం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్య బృందం పని తీరు, జిల్లా యంత్రాంగం, అధికారుల పని తీరు అభినందనీయం అని సీఎం పేర్కొన్నారు. అలాగే రాత్రి అంతా మేల్కొని ఆస్పత్రిలో బాధితులకు అవసరమైన వైద్య సహాయక చర్యలు చేపట్టిన మంత్రి ఆళ్ల నాని పనితీరు పట్ల సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదిలాఉండగా, పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో సొమ్మసిల్లి పడిపోతున్న పిల్లలు, పెద్దల సంఖ్య పెరుగుతోంది. దాదాపు 185 మంది బాధితులు ఈ వింత రోగం బారిన పడి ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న మధ్యాహ్నం నుండి బాధితులు ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. చికిత్స అనంతరం కొందరు డిశ్చార్జ్ అవుతున్నా.. ఆ వెంటనే మరికొందరు అదే సమస్యతో ఆస్పత్రిలో చేరుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్ధం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తాగు నీరు కలుషితం అవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బాధితులు చెబుతుండగా, నీటిని పరీక్షించిన అధికారులు అదేం కాదని తేల్చి చెప్పారు. అయితే ఈ వింత రోగాన్ని మాస్ హిస్టీరియాగా పేర్కొంటున్నారు మానసిక వైద్యులు. భయపడాల్సిన పనేం లేదని, ఇది కేవలం మానసిక రుగ్మత అని అంటున్నారు.